Monday, December 29, 2014

44 - న్యస్తాక్షరి-21 (బమ్మెర పోతన)

కవిమిత్రులారా, ఈనాటి పద్యరచనకు: 
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
జిగురు సత్యనారాయణ చెప్పారు...
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్
డిసెంబర్ 29, 2014 1:24 [AM]

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
భారము నీదటంచు తన పల్కుల మూలము నీవెయంచు తా
మీరిన భక్తి భావమున మేలుగ దల్చుచు రామచంద్రునే
పారగ పాతకమ్ము విన భాగవతమ్మును వ్రాసినాడుగా
కోరక రాజభోగములు గొప్పగ పోతన " భాగ్యవంతుడే ".
డిసెంబర్ 29, 2014 9:35 [PM]

Saturday, December 20, 2014

43 - పద్యరచన - 770 (మల్లెపూవు స్వగతము)



కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము
“మల్లెపూవు స్వగతము”
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/19/2014 12:05:00 [AM] 

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

sailaja చెప్పారు...
కళ్ళకు హాయిని గూర్చెద
పళ్ళెర మందున్ననేను పరిమళ మిత్తున్
గుళ్ళో నిత్యము దేవుని
మెళ్ళో హారముగ నేను మెరిసిన చాలున్!!!
డిసెంబర్ 19, 2014 6:43 [PM]

K Eswarappa చెప్పారు...
పూజకుగుర్తురో,వదలిపూర్తిగశోభనమందుజేర్తురో,
మోజునకొప్పునుంచెదరో,ముద్దుగవాల్జడకండగూర్తురో
ఫోజులనాయకుల్మెడకుపొందుగనుంతురొ,దండబేర్చి,రా
రాజులవంటిధూర్తులిటరాకకువేతురొవేచిచూసెదన్

Tuesday, December 16, 2014

42-- పద్యరచన - న్యస్తాక్షరి-19

అంశం- దాఁగుడుమూఁతలు.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘బా’
రెండవపాదం ఆఱవ అక్షరం ‘వే’
మూడవపాదం పదవ అక్షరం ‘దా’
నాలుగవపాదం పదునాఱవ అక్షరం ‘సం’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/15/2014 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
లక్ష్మీదేవి చెప్పారు...
బాసనుఁజేసితీవనుచు భాగ్యమునాదని పొంగిపోతి, నీ
కోసమె యెల్లవేళలను కోటివరమ్ముల కోరుకొంటి, నీ
దాసిగసేవఁజేసితిని దాగుడుమూతలనాడుచుంటివే?
నాసముఖమ్ముఁజేరవొకొ, నందకుమారుడ! సందెవేళలో?
డిసెంబర్ 15, 2014 8:04 [AM]

A.Satyanarayana Reddy చెప్పారు...
బాగగు నాకు నో చెలియ! భాగిని గా నువు నాకు చిక్కినన్
రాగము పంచ వే యిటకు రమ్ముసుహాసిని మంజు భాషిణీ
దాగుడు మూతలేల సఖి! దాచకు నీ హృదిలోని కోర్కెలన్
సాగును జీవితమ్ము నువు సారధి వైనను సంతసమ్ముగన్
డిసెంబర్ 15, 2014 10:04 [PM]

Monday, December 8, 2014

41-- పద్యరచన - 758 (గృహ ప్రవేశం)




కవిమిత్రులారా, మన కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారు
ఈరోజు నూతన గృహపవేశ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా
వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యము(ల)ను వ్రాయండి.

నూతనగృహప్రవేశవినోదవేళ
సకలదేవతల్ గరుణతో చంద్రమౌళి
సూర్యనారాయణకు పెక్కు శుభము లొసఁగ
గా నపేక్షించు మా శుభాకాంక్ష లివియె.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/07/2014 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
శ్రీ చంద్రమౌళి సూర్య నారాయణ ( సూరి అన్నాను ఏమీ అనుకోకండీ...) గారికి నూత్న గృహప్రవేశ ఉత్సవ శుభాకాంక్షలతో..
చంద్రమౌళీశు కృపనంది సవ్యముగను
సూర్య నారాయణుని దయ చొప్పడగను
భోగ భాగ్యమ్ములన్నియు పొంది " సూరి "
నూత్న గృహమందు చక్కగా నుండవలయు.
డిసెంబర్ 07, 2014 7:56 [AM]

Timmaji Rao Kembai చెప్పారు...
చిరంజీవి చంద్రమౌళికి శుభాశీస్సులు
కలలు సాకారముగ నిల్లుగట్టినావు
ప్రేమ బంధమ్ములగు భార్యపిల్లలుండ
వలపుతలపులు నీయెద తలుపు దీయ
శాంతి సౌఖ్యము లందుము చంద్రమౌళి

Saturday, December 6, 2014

40 - సమస్యా పూరణం - 1559 (సానిపొందు మోక్షసాధకమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సానిపొందు మోక్షసాధకమ్ము".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/06/2014 12:10:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వసంత కిశోర్ చెప్పారు...
సమధిహార ప్రణయ ♦ సామ్రాజ్య మందున
భార్యయె దొరసాని ♦ భర్త కెపుడు !
మధుర మంజులంబు ♦ మగనికి, తన దొర
సాని పొందు, మోక్ష ♦ సాధకమ్ము !
డిసెంబర్ 06, 2014 12:52 AM

కె.ఈశ్వరప్ప గారి పూరణ
కామి గాక మోక్ష గామి గాడనియెడి
మూర్ఖచిత్తు డొకడు మొ౦డి గాను
సానిపొందు మోక్ష సాధకమ్ము యనగ
నరకమందు జచ్చె తిరుగు లేక

subbarao చెప్పారు...
వలదు వలదు నీకు వగలాడి యైనట్టి
సాని పొందు ,మోక్ష సాధకమ్ము
శివుని నామ జపము జేయుట యేయిల
నెంత మంచి జేయ నంత మేలు
డిసెంబర్ 06, 2014 1:25 AM

Chandramouli Suryanarayana చెప్పారు...
పాప పంకిలంబు వలదురా నీకేల
సానిపొందు - మోక్షసాధకమ్ము
భక్తిమార్గమేర - పరమేశ్వరుని నీవు
శక్తి కొలదికొలువ ముక్తికలుగు
డిసెంబర్ 06, 2014 1:56 AM

B.S.S.PRASAD చెప్పారు...
కష్ట నష్ట మందు ఇష్ట సఖి వెరసి
ప్రేమ పంచి యిచ్చు ప్రియము గాను
కంటి పాపగ నను కనిబెట్టు నాదొర
సాని పొందు మోక్ష సాధ కమ్ము
డిసెంబర్ 06, 2014 5:57 AM

sailaja చెప్పారు...
కష్టసుఖములందు కలికి మాలక్ష్మియై
నీడవోలె పతిని వీడి పోక
నర్ధ భాగమగుచు ననుసరించెడి దొర
సాని పొందు , మోక్ష సాధకమ్ము
డిసెంబర్ 06, 2014 11:05 AM

Thursday, November 27, 2014

39 -- పద్యరచన - 747 (బొప్పాయి)



కవిమిత్రులారా పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/26/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
sailaja చెప్పారు...
గొప్పగ విటమినులుండును
ముప్పును తప్పించిమంచి పుష్టిని యిచ్చున్
చప్పున దొరికే ఫలమిది
బొప్పాయిని తినిన చాలు బోవును వ్యాధుల్

ఉదరపు జబ్బులు పోవును
మధరమ్ముగనుండు ఫలము మహిలో జనులే
విధిగా తినినను రోజూ
మదనానపు పండు మంచి మవ్వము నిచ్చున్

Wednesday, November 19, 2014

38 -- పద్యరచన - 739 (జామ పండు)



కవిమిత్రులారా  పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/18/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వసంత కిశోర్ చెప్పారు...
ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !
నవంబర్ 18, 2014 2:31 AM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.
నవంబర్ 18, 2014 10:19 AM

Sunday, November 16, 2014

37 -- పద్యరచన - 737 (అవ్వ)



కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/16/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

అవ్వా ప్రపంచములో నిన్ను చూసే వాళ్ళు ఎవ్వరూ లేరా! ఎందుకు ఈ వయసులో ఈపని చేస్తున్నావు?  అన్నారు గోలి హనుమచ్ఛాస్త్రి గారు, Chandramouli Suryanarayana గారు.
ఏం నాలుగు మెతుకులు పెట్టే పిల్లలు లేరా! అని Laxminarayan Ganduri  గారు వాపోయారు.
Shankaraiah Boddu గారు ఏమయితే ఏమి తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నిస్తోంది అన్నారు. దానికి sailaja గారు సమర్ధిస్తూ "పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు"  జేజే!!! చెప్పారు.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
అమ్మగ మెలిగిననీవే
అమ్మగ నీ పొత్తములనె యరుదెంచితివా !
ఇమ్ముగ నినుజూచుటకై
ఇమ్మహిలో నెవరులేర యిది దారుణమే !

Chandramouli Suryanarayana చెప్పారు...
అవ్వా నీవీ వయసున
నెవ్వరి యాశ్రయములేక నేకాకివిగా 
నివ్వీధిలోననమ్ముట
యివ్విధముగ పత్రికలను నివ్వెరపరచున్
నవంబర్ 16, 2014 12:59 AM 

Laxminarayan Ganduri చెప్పారు...
ఎనుబది యేండ్లు నిండినవి యెందుకు కష్టము ఫూటుపాతుపై
ననుదిన మిట్టులన్ జనుల కమ్ముచు నుంటివి వార్త పత్రికల్
తనయులు బుక్కెడన్నమును తల్లికి బెట్టని వారలుందురే !
జననము నిచ్చి రాగమున సాకిన త్యాగికి వృద్ద మాతకున్.
నవంబర్ 16, 2014 4:51 PM

Shankaraiah Boddu చెప్పారు...
పుత్రులు లేకనో మరియు పుత్రిక లెవ్వరు చెంతలేకనో
సత్రమునందుభుక్తికయి సాయము గోరక కష్టమొందుచున్
చిత్రముగా ప్రయత్నమును జేయుచు నున్నది కాలిబాటపై
పత్రిక లమ్ముచున్ ముసలి బామ్మ శ్రమించుచు పొట్టకూటికై
నవంబర్ 16, 2014 5:53 PM

sailaja చెప్పారు...
హస్తములు వణుకు వయసున
పుస్తకముల నమ్ముచున్న ముదుసలి గనరే!
మస్తకమున తెలివి గలిగి
పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు జేజే!!!

Wednesday, November 12, 2014

36 -- పద్యరచన - 733 (సీతాఫలం)



కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/12/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

లక్ష్మీదేవి చెప్పారు...
రూపముఁ జూడగా జనులు రోసియు వీడరు కొన్ని పండ్లనే
లోపముఁ గానరాదనగ లుబ్ధతతో తిని సొక్కుచుందురీ
తీపి ఫలమ్ములన్; వనుల తీరుగ పండు మృగాళికెల్ల క్షు
త్తాప నివారణమ్మవగ ధాత్రి యొసంగు వరమ్ము భంగినిన్.
నవంబర్ 12, 2014 1:05 PM

Saturday, November 8, 2014

35 -- పద్యరచన - 729 (చిన్నారి విన్నీ)




కవిమిత్రులారా పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/08/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

Timmaji Rao Kembai చెప్పారు...
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పద్య రచన విరిబాల

బాలిక సోయగమ్ముగన బంతి సుమమ్ములు పూచె నావనిన్
మేలిమి నున్నబుగ్గలను మెల్లగతాకెను తన్మయమ్మునన్
మీలిత కన్నులన్ చిరుత మించు సువాసన లాశ్వసించగా
మాలిమిజేసె నీ ప్రకృతి మాత యొసంగుచు దీవెనల్ సదా
నవంబర్ 08, 2014 12:36 PM

Wednesday, November 5, 2014

34 -- సమస్యా పూరణం - 1543 (వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య.)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/04/2014 12:10:00 AM

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Laxminarayan Ganduri గట్టిగా చెప్పారు ...
వల్ల కాటికి జేరెడు వయసు నీది
యీదు చుంటివి కడురోగ పుదతిలోన
మూడు కాళ్ళతో నడిచెడి మూర్ఖ! యేల
వార్ధకమ్మున గావలె బడుచు భార్య?
నవంబర్ 04, 2014 8:02 PM


Chandramouli Suryanarayana ఇంకా గట్టిగా చివాట్లు పెట్టారు ...
పెళ్లి గోలేల వృద్ధుఁడ వెళ్ళవయ్య
జుట్టు నెరిసెను కనులేమొ సొట్ట బోయె
నడుము వంగెను నలుగురు నవ్వ, నేల
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య?
నవంబర్ 04, 2014 12:54 AM

Timmaji Rao Kembai  గారు పైవారిద్దరికీ మంచి సమాధానం చెప్పారు...
వయసు నందు న౦తరములు పతి సతులకు
హెచ్చుగానుండ భర్తకు నిబ్బడిగను
ప్రేమ పెరుగును భార్యపై ,పిదప తనకు
వార్ధకమ్మున గావలె పడుచు భార్య
సేవ లొనరింప నుండును సిద్ధముగను
నవంబర్ 04, 2014 6:14 PM

గోలి హనుమచ్ఛాస్త్రి గారు దానిని చక్కగా వర్ణించారు ...
వయసునందున ప్రేమించ " బడుచు భార్య "
వాదులాటల గొడవలు " బడుచు భార్య "
పలువిధమ్ములుగా సాయ " బడుచు భార్య "
వార్ధకమ్మునఁ గావలెఁ " బడుచు భార్య."

Sunday, November 2, 2014

33 -- సమస్యా పూరణం - 1542 (దీపముఁ బెట్టంగఁ దగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్"

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/02/2014 07:29:00 AM

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Chandramouli Suryanarayana చెప్పారు...
నిన్నటినించి బ్లాగ్ చూడకపోవుట వలన మాస్టారి అనారోగ్యము గురించి తెలియ లేదు. మాస్టారు త్వరగా కోలుకోన ఆ భగవంతుని ప్రార్ధించెదను 

మాపుము తలపై దెబ్బను
కాపాడుము శంకరార్యు కరుణను నని నే
నా పరమాత్ముని వేడుచు
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్

Monday, October 27, 2014

32 -- సమస్యా పూరణం – 1538 (హరి హరికిన్ హరిని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Chandramouli Suryanarayana చెప్పారు...
విరహిణి యాకృష్ణమనో
హరి హరికిన్ హరిని జూపి హరియించమనెన్
కరుణను శశి కలిగించెడు
విరహపు తాపంపు బాధ వెన్నెల యందున్((హరికిని=చంద్రుని)్
ి

Thursday, October 23, 2014

31 - పద్యరచన - 715 ( దీపావళి శుభాకాంక్షలు )

కవిమిత్రులారా,

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పద్యరచన చేయండి.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

krkr చెప్పారు...


ఆశ్వీజ మాసము అంతమయ్యే వేళ పండుగ శోభతో పరిఢ విల్లు
మంగళ స్నానాలు మంజుల గీతాలు కట్నాలు కానుకల్ కనుల విందు
పులిహోర ,బొబ్బట్లు మురిపించు శాఖముల్ భోజన ప్రియులకు బొజ్జ నింపు
దీప కాంతుల చేత దీపించు భవనాలు "కాకర వత్తుల" కాంతి పుటలు
మున్ను అల్లుళ్ళ అలుకలు ముచ్చటగను
"బాపు"బొమ్మల నవ్వుల బాణ సంచ
"బాంబు"పేల్చెడి సరదాల బావ గార్లు
తార జువ్వలు వెలిగించు తార లంత
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
జీవితమందు క్లేశములఁ క్షీణతనొందగఁజేసి దివ్యమౌ
భావన గల్గఁజేసి పరిభావములెల్ల తొలంగఁజేయుచున్
ధీవరపుణ్యకీర్తులయి తేజమునందగ జేయునట్టి దీ
పావళి సర్వసౌఖ్యకరమై యలరించు కవిత్వమూర్తులన్. 
Timmaji Rao Kembai చెప్పారు...
పూజ్యులు గురుదేవులుశంకరయ్యగారికి కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
పద్య రచన
చక్కటి చిత్రము నందున
పిక్కటిలగ దీపములను పేర్చిన ముదితా!
మక్కువ నభి నందనలను
నొక్క కవియు జెప్పడాయె నుత్సాహముగా
అందరి తరఫున నేనభి
నందనలను తెలుపుచుంటి నందుకొనుమునీ
చందముమెచ్చగ నత్త యు
బంధు జనము ప్రీతి నొంద వాసిన్ గనుమా

Saturday, October 18, 2014

30 -- సమస్యా పూరణం – 1534 (గంగను మున్గి పాపముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన పూరన ఇది...
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
శ్రీపతిశాస్త్రి చెప్పారు...
శ్రీగురుభ్యోనమః

బంగరు భూమి భారతము పావనితీర్థము పారుచుండగా
మంగళమాయె జీవులకు మానవ జాతులు స్వార్థచిత్తులై
దొంగలవోలె సంపదలు దోచిరి, దుష్ట దురూహబుద్ధిదుర్
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

దుష్ట దురూహబుద్ధిదుర్గంగ = దుష్టమైన చెడ్డ ఊహలు కలిగిన బుద్ధి యనెడు కలుషిత నీరు.

Tuesday, October 14, 2014

29 -- పద్యరచన - 706 ( తల్లి )

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Shankaraiah Boddu చెప్పారు...
వంటకుపక్రమించి పసిపాపను లాలన చేయు తల్లియై
కంటికి రెప్పచందమున కాచుచు బిడ్డను నిద్ర బుచ్చగా
తుంటరి బాలచేష్టలను తొల్లిగ జూచుచు సంబరమ్ముతో
వంటను విస్మరించినది బాలుని చూపులు మత్తుగొల్పగన్!
శ్రీగురుభ్యోనమ:

అల్లారు ముద్దు సూనుని
నుల్లాసముతోడ ప్రేమనూయలలూపన్
కల్లాకపటం బెరుగని
తల్లీ నీ సేవ చేత ధన్యుండయ్యెన్.

Wednesday, September 17, 2014

28 -- పద్యరచన - 679 (విమాన ప్రయాణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విమాన ప్రయాణము”
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

sailaja చెప్పారు...
గగన వీధుల నెగిరెడి ఖగము వోలె
పాల మబ్బుల మధ్యలో పరుగు దీయు
దూర మెంతైన చిటికెలో చేరుకొనుచు
హాయిగొల్పు విమాన ప్రయాణ మనిన!!!
Chandramouli Suryanarayana చెప్పారు...
జెట్టులోనెక్కుట చిరకాల స్వప్నంబు - సాకార మవబోవు సమయమిదియె
గాలిలోననెగురు గరుడపక్షినిబోలు -నెయిరుబస్సునుజేరి యెక్కుచుండ
చిరునవ్వు చిందించి చేతులు జోడించి -స్వాగతమిడెనొక సరసిజాక్షి
సీటులో గూర్చుంటి శీతలీకరణపు - చల్లదనమ్ములో మెల్లగాను
యెగిరె లోహవిహంగమీ యిలను వదిలి
వాయువేగంబునజనుచు హాయిగాను
గనులు మూయంగ నిదురలో కలలుమూగె
గగన చరులైన దివిజుల గంటినచట

Wednesday, September 10, 2014

27 ---- సమస్యా పూరణం – 1509 (పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

కంది శంకరయ్య చెప్పారు...


అరినైనన్ హరినైనన్
తిరముగఁ వీక్షణపు బాణతీవ్రతతోడన్
మురిపింతురు మరపింతురు
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.
వసంత కిశోర్ చెప్పారు...
పురుషులను కని పాలిచ్చిపెంచి పోషించి ప్రేమను పంచే దేవతలేగదా స్ర్తీలు :

06)
__________________________________

తరమగునె స్త్రీల కే విధి
పురుషుల ప్రాణములఁ దీయఁ? - బుట్టిరి వనితల్
పురుషుల కూపిరు లూదుచు
పెరిమను పాలిచ్చి పెంచి - ప్రేమను పంచన్ !
__________________________________
నాగరాజు రవీందర్ చెప్పారు...
ఏదో సరదాకు ; మహిళామణులు దీనిని సీరియస్ గా తీసుకోవద్దని మనవి :

సరదాలకు వెచ్చింతురు
చిరచిర లాడుచు కొనుమని చీరలు సొమ్ముల్
కిరికిరి జేతురు రాత్రికి ;
పురుషుల ప్రాణములు దీయ బుట్టిరి వనితల్
విరితూపు వంటి చూపులు
మరాళమును బోలు సొగసు మందగమనముల్
మరుతేజి పలుకులు కలిగి
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్ 
చెరబట్టిన రావణులన్
నరకాదుల వంటి ఖలుల నాశము జేయన్
పరమేశ్వరి నంశములై
పురుషుల ఫ్రాణములు దీయ బుట్టిరి వనితల్
తరగని తరణుల కోర్కెలు
నెరవేర్చని భర్త లెల్ల నిర్వేదముతో
తరచుగ బలుకుదు రిట్టుల
పురుషుల ప్రాణములు దీయ పుట్టిరి వనితల్.

Tuesday, August 26, 2014

26 --- సమస్యా పూరణం – 1508 (కామదాసులైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కామదాసులైనఁ గలుగు ముక్తి
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

కామేశ్వర శర్మ శ్రీఆదిభట్ల చెప్పారు...
కామి కానివాడు కాబోడు తామోక్ష
కామి యనెడు మాట కలదు భువిని
తలచెనొకడు దాని తప్పుగా నీరీతి
కామ దాసులైన కలుగు ముక్తి.
ఆగస్టు 26, 2014 10:02 AM

sailaja చెప్పారు...
బాల కుండు చదివె బడిలోన పద్యము
కామ దాసు లైన కలుగు ముక్తి
అచ్చుత ప్పటంచు ననుయోక్త సరిదిద్దె
కాళి దాసు లైన కలుగు ముక్తి
ఆగస్టు 26, 2014 12:07 PM

Friday, August 22, 2014

25 - సమస్యా పూరణం – 1506 (అమ్మా యని పిలువగానె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్. 
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Chandramouli Suryanarayana చెప్పారు...
అమ్మా! యిదిగో గనుమీ
యమ్మాయే నీకు కోడలని సుతుడన యా
యమ్మాయేమో హాయ
త్తమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్
(హాయ్+ అత్తమ్మా )
Annapareddy satyanarayana reddy చెప్పారు...
ఇమ్మగు రూపున నూర్వసి
కమ్మనిసుఖముల నిడుమని కవ్వడిఁ గోరన్
చిమ్మ తిరిగి యాతనిమది
యమ్మా యని పిలువగానె యాగ్రహ మందెన్
శ్రీగురుభ్యోనమ:

నమ్ముచు నాంగ్లపు చదువుల
నమ్మా యని పిలువగానె యాగ్రహ మందెన్
"మమ్మీ యనరా వెధవా
కమ్మగ" యని సుతుని దిట్టె గంభీరముగా




Wednesday, August 20, 2014

24 - దత్తపది - 39 (గద్యము-పద్యము-మద్యము-హృద్యము)

కవిమిత్రులారా!
గద్యము - పద్యము - మద్యము - హృద్యము
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో 
కవిత్వప్రయోజనాన్ని వివరిస్తూ పద్యం వ్రాయండి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

గద్యము శబ్ద వాద్యముల ఘల్లను కంకణ నిక్వణ మ్మిడన్
పద్యము రాగతాళ యుత భావన,స్పందన,స్ఫూర్తి నీయగా
హృద్యములైన కావ్యములు సృష్టిని జేయుము విశ్వ శ్రేయమై
మద్యము గ్రోల నేమగును మైమరపే గద బుద్ధి మాంద్యమున్
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
పద్యము జదివితి తిక్కన
గద్యమునే చదివినాడ కావ్యమునందున్
హృద్యముగా నుందంటిని
మద్యము గోలెందుకయ్య మధ్యన గ్రోలన్.

Tuesday, August 12, 2014

23 - పద్యరచన - శ్రద్ధాంజలి! (శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు)


సుకవి, యధ్యాత్మ రామాయణ కృతికర్త,
మాన్యగురుదేవుఁడైన నేమాని రామ
జోగి సన్యాసి రావుకు శోకతప్త
మైన హృదయ మర్పించు శ్రద్ధాంజలి యిది! .... (కంది శంకరయ్య)

నేమాని పండితార్యులు
భూమిని విడి వాడిపోని పూవై సీతా
రాముల పదముల వ్రాలగ
నేమో దివికేగి నారు యీ దిన మయ్యో ! .... (మిస్సన్న)

 సీ.
 శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
 స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
 తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
 రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
 తే.గీ.
 ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
 నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
 స్వర్గమేగిన నేమాని పండితార్య!
 మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత! .... (గుండు మధుసూదన్)


అష్టావధానమ్ములతిమనోహరముగ
....... వెలయించినట్టి ప్రావీణ్యయుతులు
పద్యవిద్యావైభవమునెల్ల జగతిన
....... వ్యాపింపజేసిన ప్రథితకవులు
నధ్యాత్మరామాయణాది కావ్యంబుల
....... సృజియించినట్టి సంస్థితుఁడవీవు
భావికవులకెల్ల ప్రామాణికమ్ముగా
....... భావింపదగిన విభ్రాజితుండు

శంకరాభరణమ్మున సంశయములఁ
దొలఁగజేయుచు జ్ఞానమ్ము కలుఁగజేసె !!
పండితోత్తమనేమాని వర్య మీదు
యాత్మ శాంతిని పొందగానభిలషింతు. ... (సంపత్ కుమార్ శాస్త్రి) 





శ్రీపతిశాస్త్రి చెప్పారు...
శ్రీగురుభ్యోనమ:

భారతి కంఠహారమున భాస్కరతేజము ప్రజ్వలింపగా
కారణమేమిటో యనుచు కాంచగ,కన్ గొని విస్మయంబునన్
భారములాయె నాకనులు భాష్పపుధారలుగారుచుండగా !
మా రవితేజపండితుడు మమ్ముల వీడెను ముక్తినొందుచున్

రామాయణ కృతికర్తా
ప్రేమగ మము తీర్చిదిద్దు పెద్దన సముడౌ
నేమాని పండితార్యా
స్వామీ, శ్రద్ధాంజలిదియె పావనమూర్తీ !

గురువర్యులు శ్రీ పండితనేమాని కవీవీశ్వరుడు పరమపదినించినారను విషయమును బ్లాగు మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి ద్వారా తెలిసినది. మిగుల దు:ఖకరమైన విషయము. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు జయప్రదముగా నిర్వహించుచున్న భువనవిజయము వంటి శంకరాభరణము నందు మహాకవి పెద్దన వలె మనకు యెన్నో అమూల్యమైన సూచనలను, భాషా సంపత్తిని,కవితామృతమును అందించిన గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కల్గి ఆ సరస్వతి సన్నిధానమున సేవలనందింతురని ప్రార్థించుచున్నాను.

Rao S Lakkaraju చెప్పారు...
శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త ఇప్పుడే చూశాను చాలా బాధ కలిగించింది. వారిని న్యుజేర్సి లో కలుద్దామనుకున్నా కానీ వీలు కలుగలేదు. శంకరాభారణంలో భాగంగా ఉన్న మనందరికీ వారు ముఖ్యులు. వారు లేని లోటును తీర్చటం చాలా కష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక.





Saturday, August 2, 2014

22 - పద్యరచన - 639 (పల్లె పిల్ల)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.


 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
గుండా వేంకట సుబ్బ సహ దేవుడు చెప్పారు...
చక్కని చీరను దీర్చెను
పిక్కల పైదాక, కొంగు బిగచుట్టగ పై
నిక్కిన సోయగ మదిరెన్
జిక్కదె మది గడ్డి మోపు చేతుల కెత్తన్?