Wednesday, September 17, 2014

28 -- పద్యరచన - 679 (విమాన ప్రయాణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“విమాన ప్రయాణము”
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

sailaja చెప్పారు...
గగన వీధుల నెగిరెడి ఖగము వోలె
పాల మబ్బుల మధ్యలో పరుగు దీయు
దూర మెంతైన చిటికెలో చేరుకొనుచు
హాయిగొల్పు విమాన ప్రయాణ మనిన!!!
Chandramouli Suryanarayana చెప్పారు...
జెట్టులోనెక్కుట చిరకాల స్వప్నంబు - సాకార మవబోవు సమయమిదియె
గాలిలోననెగురు గరుడపక్షినిబోలు -నెయిరుబస్సునుజేరి యెక్కుచుండ
చిరునవ్వు చిందించి చేతులు జోడించి -స్వాగతమిడెనొక సరసిజాక్షి
సీటులో గూర్చుంటి శీతలీకరణపు - చల్లదనమ్ములో మెల్లగాను
యెగిరె లోహవిహంగమీ యిలను వదిలి
వాయువేగంబునజనుచు హాయిగాను
గనులు మూయంగ నిదురలో కలలుమూగె
గగన చరులైన దివిజుల గంటినచట

Wednesday, September 10, 2014

27 ---- సమస్యా పూరణం – 1509 (పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

కంది శంకరయ్య చెప్పారు...


అరినైనన్ హరినైనన్
తిరముగఁ వీక్షణపు బాణతీవ్రతతోడన్
మురిపింతురు మరపింతురు
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్.
వసంత కిశోర్ చెప్పారు...
పురుషులను కని పాలిచ్చిపెంచి పోషించి ప్రేమను పంచే దేవతలేగదా స్ర్తీలు :

06)
__________________________________

తరమగునె స్త్రీల కే విధి
పురుషుల ప్రాణములఁ దీయఁ? - బుట్టిరి వనితల్
పురుషుల కూపిరు లూదుచు
పెరిమను పాలిచ్చి పెంచి - ప్రేమను పంచన్ !
__________________________________
నాగరాజు రవీందర్ చెప్పారు...
ఏదో సరదాకు ; మహిళామణులు దీనిని సీరియస్ గా తీసుకోవద్దని మనవి :

సరదాలకు వెచ్చింతురు
చిరచిర లాడుచు కొనుమని చీరలు సొమ్ముల్
కిరికిరి జేతురు రాత్రికి ;
పురుషుల ప్రాణములు దీయ బుట్టిరి వనితల్
విరితూపు వంటి చూపులు
మరాళమును బోలు సొగసు మందగమనముల్
మరుతేజి పలుకులు కలిగి
పురుషుల ప్రాణములఁ దీయఁ బుట్టిరి వనితల్ 
చెరబట్టిన రావణులన్
నరకాదుల వంటి ఖలుల నాశము జేయన్
పరమేశ్వరి నంశములై
పురుషుల ఫ్రాణములు దీయ బుట్టిరి వనితల్
తరగని తరణుల కోర్కెలు
నెరవేర్చని భర్త లెల్ల నిర్వేదముతో
తరచుగ బలుకుదు రిట్టుల
పురుషుల ప్రాణములు దీయ పుట్టిరి వనితల్.