Monday, December 14, 2015

63 -- సమస్య - 1883 (కొట్టెడు పతి సుజనుఁ డనుచు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Anjaneya Sharma విరించిడిసెంబర్ 13, 2015 11:54 [AM]
గురువు గారికి, కవిమిత్రులకెల్లరులకు నమస్కారములు.

కట్టడి సేయక భార్యకు
పెట్టెల నిండార నగలు పీతాంబరముల్
పెట్టుచు సతి మాటకు జై
కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్ .

పట్టిన కుందేలున కే
పట్టున లెక్కిడిన మూడె పాదము లనగన్
రెట్టించక వెంటనె "ఊ
కొట్టెడు" పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్

నా పూరణ....

పుట్టెడు పనిలో మునిగియు
పట్టినిఁ దా బుజ్జగించి పడుకొనఁబెట్టన్
గట్టిగఁ బాడుచు మరి జో
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.

Monday, November 9, 2015

62 -- పద్యరచన - 1059 (పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై)

కవిమిత్రులారా!
“పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/09/2015 12:01:00 [AM]


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూజార్థినై చేరితిన్
కామార్థమ్ముల గోరనైతి నిను నిష్కామంబుతో కొల్చుచున్
నే మోక్షమ్మును గోరి వచ్చితిని నన్నేలంగ జాగేలనో
కామాక్షీ! నినునమ్ము భక్తులనిలన్ గాపాడవే నిత్యమున్
పూమాలన్ గడు భక్తిఁదెచ్చితిని నీపూజార్థినై కొమ్మ! నీ
నామంబే జపియించుచుంటి సతమున్ నాపై దయంజూపుమా!
ఆమీనాంకుడు నాదుమానసమునందాసీనుడైయుండి వే
కామంబున్ పురిగొల్పుచుండె పతిగాఁగావించి నన్బ్రోవుమా!

Saturday, October 24, 2015

61 -- సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్."
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 10/20/2015 12:02:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : 

కలములు పట్టబోరిపుడు కాగితమక్కర లేదు వ్రేలితో
తళుకుల నీను యంత్రమున ధాటిగ ఛాటులనాడు వారికిన్
కళలును భాషయున్ మధురకావ్యము లెందుల కాంగ్ల బానిసల్
లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్
పలువిధ కష్టనష్టముల పాలయి జీవనయాన మందునన్
నిలువగ నీడయున్ కడుపునిండుగ కూడును లేనివారలన్
తలచుచు సాటిమానవుల తక్షణరక్షనొనర్చ మేలగున్

Sunday, October 18, 2015

60 -- సమస్యాపూరణ - 1770 (ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్."
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 8/26/2015 12:02:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

శ్రీగురుభ్యోనమ:

మెండగు విషయమ్ములతో
పండిన యీ పద్యతోట పరికించుటకై
యండగ నంతర్ జాల
మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్.

అండగ నిలిచెడు దేవిని
పండగ రోజంటు భార్య భక్తిన గొలవన్
దండిగ శోభించిన చా
ముండను వీక్షించి మగడు మోదము నందెన్

మెండగు భక్తిన్ దంపతు
లండ శివుండంచుఁ గొలువ నా సతి కడుపున్
బండించెను శ్రీగిరి సో
ముం డనువీక్షించి - మగఁడు మోదము నొందెన్!

మిత్రులందఱకు నమస్సులతో...

కొండొకఁడు సతీ యుతుఁడై
మెండుగ హరిఁ గొల్చియు, "ధన మి"మ్మన, దయ వి
ష్ణుం డిడె! సతిపైఁ గనక
మ్ముండను వీక్షించి, మగఁడు మోదము నందెన్!!

Monday, September 28, 2015

59 -- పద్య రచన - 1017 (వినాయక నిమజ్జనం)


కవిమిత్రులారా, పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 9/27/2015 12:01:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమః

సజ్జన జాతిని బ్రోచుచు
ముజ్జగముల నేలుచుండు మూషికరథుడౌ
యొజ్జ గనేశుని గొలచుచు
మజ్జన మొనరించుచుండ్రి మమకారముతోన్
సెప్టెంబర్ 27, 2015 5:09 [PM]


ఊకదంపుడు చెప్పారు...

నిత్య పూజ లన్ని నియమానుసారము
సలుప లేక జనులు సాగనంపు
పర్వ మద్దె పెద్ద పండువగా మారెఁ
గాంచుడిద్దియె కలికాల మహిమ.

Sunday, June 21, 2015

58 - పద్య రచన - 938 (కన్నతల్లి)


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 6/21/2015 12:01:00 [AM] 

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

వసంత కిశోర్ చెప్పారు...
పీక వరకు నీరు - వెల్లువగట్టినన్
పిచ్చి తల్లి బాలు - విడువలేదు
కన్నతల్లి సాటి - కన్నతల్లేగదా !
దైవమిలను తిరుగు - తల్లివోలె !

Thursday, May 14, 2015

57 - సమస్యా పూరణము - 1674 (కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 5/14/2015 12:02:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Chandramouli Suryanarayana చెప్పారు...
నాకమృతసమానమగును
భీకరమగు చేదుకూడ ప్రియతమ వినుమా
నీకరములతోనిచ్చిన
కాకర కాయల రసమ్ము కడుమధురమగున్
మే 14, 2015 12:25 [AM]

కంది శంకరయ్య చెప్పారు...
ఆ కవి వేమన చెప్పెను
గా కోరి తినఁ దిన వేము గడుఁ దియ్యన నౌఁ
గా కడు నభ్యాసమ్మున
కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్

Sunday, May 10, 2015

56 - పద్య రచన - 901 (కందా నీ బొందా)


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వ్యంగ్య చిత్రకారిణి ‘శాంత’ గారికి ధన్యవాదాలతో)

నా పద్యము...
పనులలోన మున్గి వ్యస్తురాలైన యి
ల్లాలిని విసిగించ మేలు గాదు,
కంద పేరు ప్రాస కందగ నీబొంద
యనిన పతికి గాయ మాయె నహహ!

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 5/10/2015 12:01:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

వసంత కిశోర్ చెప్పారు...
కంద కూర నీదు - బొందకూరనినంత
వేగ మాడు పగిలె - విరిగె చేయి
ప్రాస కుదిరి నంత - పరిహాస మది తప్పు
భార్య తోడ నైన - భర్త కెపుడు !

Wednesday, April 15, 2015

55 - సమస్యా పూరణము - 1648 (రణము కవులకు కీర్తికరమ్ముగాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రణము కవులకు కీర్తికరమ్ముగాదె.
(ఆకాశవాణి వారి సమస్య)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 4/15/2015 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

డా. విష్ణు నందన్ చెప్పారు...
యతుల మన్నించి ప్రీతి నత్యాదరమునఁ
బ్రాసలౌదలఁ దాల్చి నిర్వ్యాజ భక్తిఁ
గావ్య కన్యకకుం గూర్చఁగల యలంక
రణము కవులకు కీర్తికరమ్ముగాదె !

Thursday, March 26, 2015

54 - పద్య రచన - 859 (శంకరుడి ఆభరణం)




కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/25/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యములు :

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
కంది వారి తోట కవనంపు విరులంట
పద్య విద్య యందు ప్రాజ్ఞు లంత
శంక రాభ రణము సాటివే రేదని
వేలు పనుచు గురువు వేడె భక్తి
మార్చి 25, 2015 3:12 [AM]

మిస్సన్న చెప్పారు...
కవనవైభవ మన్న కమనీయ హారాన
........తాపిన మణులు పద్యము లనంగ
సరసచమత్కృతుల్ సందడి జేసెడు
........పూరణ రత్నాలు పొదిగి రనగ
ధగధగ మెరయుచు తాకుచు హృదయాల
........దత్తపదీ వజ్ర తతులు నిగుడ
పద్యరచనములన్ ప్రభల నుద్దీపించు
........పచ్చలు భాసింప ముచ్చటగను

తనరు మహనీయ విష్ణునందనుల వంటి
కవికులాన్వయ చంద్రుల కైత లనెడు
పగడముల నుంచి శంకర భవ్య శిల్పి
చేసె శంకరాభరణమ్ము భాసురముగ.
మార్చి 25, 2015 6:40 [PM]

Wednesday, March 18, 2015

53 - న్యస్తాక్షరి - 21 (బమ్మెర పోతన)


న్యస్తాక్షరి - 21
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :

జిగురు సత్యనారాయణ చెప్పారు...
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్

Wednesday, March 11, 2015

52 - పద్యరచన - 845 (అద్దంతో మా ఆవిడ)



కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/11/2015 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
నారంభా నా యూర్వసి
చేరంగా రావెయంచు చెంతనె రోజున్
తీరుగ జెప్పి యబద్ధము
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.
మార్చి 11, 2015 7:53 [AM]

Sunday, March 1, 2015

51 - సమస్యాపూరణం – 1129 (మనము శాంతించు నెన్నొ సమస్య లున్న)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
"మనము శాంతించు నెన్నొ సమస్య లున్న".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 7/31/2013 06:00:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Zilebi చెప్పారు...
సడలి బడలి ఇంటికి రావంగ
మురిపెంగ గృహిణి సేద తీరనీయంగ
మనంబున సంతోషమ్ము ఉరకలేయంగ,
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న!
జులై 31, 2013 6:38 [AM]

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
శ్రీమతి జిలేబీ గారిభావానికి నాపద్యరూపము......

పలుతెఱంగులనుద్యోగ బడలికలను
మరువజేయంగ నేర్చిన మహిత మూర్తి
పతిని సేవించునట్టి సద్భార్యవలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న.

నేటికార్యాలయమ్మునందాటుపోట్లు
ఘోర రహదారి పయనంబు గూర్చు నట్టి
బాధ మరిపించి మురిపించు భార్య వలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న
జులై 31, 2013 3:36 [PM]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
పసిడి ముద్దుల నగవుల మిసిమి తనయ
చేరి యొడి లోన కిలకిల చిలుక పలుకు
చుండ పులకించి సంతస మొందినంత
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న
జులై 31, 2013 10:10 [PM]

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
మనమునందున భయమును మసలనీక
నేది జరిగిన మనమంచికేననుచు
ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న

Friday, February 27, 2015

50 - పద్యరచన - 832 (గళ్ళనుడికట్టు)


కవిమిత్రులారా,  పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/26/2015 12:13:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
భాషయందు పట్టు బాగుగా చూపెట్టు
కళయె పట్టుబడును కలము బట్టి
అడ్డనిలువు గనుచు నా గళ్ళనుడికట్టు
పట్టుబట్టి నింపు వారికెపుడు.
ఫిబ్రవరి 26, 2015 8:30 [PM]

లక్ష్మీదేవి చెప్పారు...
పదములపైన పట్టు గల వారును, భాషనుఁ బ్రేమతో సదా
ముదమగురీతులందు నొక మోహన వాగ్ఝరి గల్గువారునున్,
కదములు త్రొక్కగల్గు బలు కైతల గుఱ్ఱములెక్కువారు, నీ
పదచతురంగకేళినిక బల్వురు మెచ్చగ నింపుచుండరే!

Tuesday, February 24, 2015

49 - పద్యరచన - 821 (బొప్పాయి)

కవిమిత్రులారా,



పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/14/2015 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
subbarao చెప్పారు...
పండది జూడగా మిగుల పక్వము నొందుచు నెఱ్ఱ గా నునై
అండము లెన్నియో కలిగి హర్షము నీయుచు నందమై మఱిన్
మెండుగ నిచ్చుగా నిలను గుండెకు బాగుగ శక్తి పుంజమున్
బొండము వోలెయా ఫలము బొప్పయి నామము పేర నుండెగా

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
గొప్పగ నుండును రుచియే
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్
కప్పున కలిసిన ముక్కల
బొప్పాయిని తినగ మిగుల పొట్టకు హాయౌ.
ఫిబ్రవరి 14, 2015 8:44 [AM]

Tbs Sarma చెప్పారు...
ఎబిసిడి విటమిన్లు హెచ్చుగ నుండగ
తరచుగ తినుచుండ తనివి దీర
యాకలి పుట్టించు, నందము పెంచును
మోమున గుజ్జును మెత్తు చుండ,
పత్రముల్ పనిచేయు పదునుగ డెంగ్యూ జ్వ
రంబున జనులకు, రక్త వర్ణ
ము రుధిర మందున పొదలు కొనును,
రక్తపోటుకు పచ్చి యుక్త మగును,
జలుబు, చెవిపోటు, తామర, మొలల, కీళ్ళ
నొప్పు లందు ఫ్లూ జ్వరమున నొప్పు నోయి
కామ భావనోత్ప్రేరక కారకంబు
కనగ కల్పవృక్ష మనగ కనుల ముందు.
ఫిబ్రవరి 14, 2015 2:23 [AM]

Sunday, February 22, 2015

48 - సమస్యా పూరణం - 1596 (కందములను వ్రాయు కవులు గాడిదలు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కందములను వ్రాయు కవులు గాడిదలు గదా."
ఈ సమస్యను సూచించిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/13/2015 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :
ఛందోగుణములనెంచక
సందర్భోచిత విషయము చర్చింపకనే
చిందులు వేయుచు నొప్పని
కందములను వ్రాయు కవులు గాడిదలు కదా!
ఫిబ్రవరి 13, 2015 3:51 [PM]

Saturday, February 21, 2015

47 - పద్యరచన - 825 (ఉల్లిపాయ)



కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/18/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
ఉల్లట్టు లుప్మలందున
అల్లనవంకాయకూర లాలున గలుపన్
పుల్లని గోంగుర నుల్లిని
చల్లన్నములోన దినగ చాలా రుచియౌ.

Friday, February 20, 2015

46 - పద్యరచన - 815 (సూర్యకాంతం)

కవిమిత్రులారా,



పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/08/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


subbarao చెప్పారు...
గంప గయ్యాళి వేషాన గటువు గలిగి
యెంత మందినో బాధించు నింతి గాను
సూర్య కాంతమ్మ ! నీవిల బేర్వ డసితి
వి మఱి వందన ములునీకు వేయి యిడుదు
ఫిబ్రవరి 08, 2015 2:03 [AM]

A.Satyanarayana Reddy చెప్పారు...
అత్తపాత్రలందు నధికమౌ ప్రతిభతో
తెలుగు చిత్ర సీమ వెలిగె నామె
పిండి వంటలెన్నొ ప్రేమతోఁ బంచుచు
తోటి నటుల మదిని దోచుకొనియె
ఫిబ్రవరి 08, 2015 11:16 [AM]

Wednesday, February 18, 2015

45 - పద్యరచన - 823 (సుందరి)

కవిమిత్రులారా,



పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/16/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Chandramouli Suryanarayana చెప్పారు...
సుందర వదనను వచ్చితి
నందములందించి నిన్నునలరింపంగన్
పొందుమెనలేని సుఖముల
నెందులకీ తపము చేరుమీకౌగిలిలో
ఫిబ్రవరి 16, 2015 12:27 [AM]