Saturday, June 8, 2019

83 - సమస్యా పూరణం -464 (పదపదమందు శోభిలును)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
(నిజానికి ఇందులో ‘సమస్య’ లేదు. పాదపూరణమే! మీ మీ కవితామాధుర్యాన్ని చవిచూపడమే!)
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్.
ఈ పద్యపాదాన్ని పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

శ్రీపతిశాస్త్రిసెప్టెంబర్ 18, 2011 8:44 AM
శ్రీగురుభ్యోనమ:

వదనము నందు తేజములు వర్ధిలుచుండగ పృచ్ఛకోత్తముల్
ముదమున నిచ్చు ప్రశ్నలకు మోదము నందుచు పద్యపాదముల్
కుదురుగ గూర్చి జెప్పు ఘన కోవిదు నాగఫణీంద్రశర్మకున్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

శ్రీ పతి శాస్త్రి గారూ! చక్కటి పద్యం తో భారతి పాద విభూషణ ధ్వని ని వినిపించారు
పదపద వేడుకొందమిక పల్కుల రాణిని, వేడుకొన్నచో
వదనము నందు జేరు శుభ వాక్కుల వెల్గులు, పద్యమల్లుచో
వదలక వర్ణ వర్ణమున పాదము నిల్పుచు నాట్య మాడుగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

సదమల వేదశాస్త్రముల సారమునంతయుకొంతకొంతగా
పదములయందు, పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని భక్తిగనాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!

అదటది లేనివారు, బలె - యాంధ్రుల పాలిటి యాత్మ బంధువుల్
సదయులు నన్నపార్యు లిల - చక్కగ జెప్పిన భారతమ్మునన్
పదపదమందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన మోదమంది,మది - జారును నూహల లోకమందునన్ !

మృదువగు పూలపై కరుణ - మేలిమి బంగరు భూషణంబనన్
పొదిగెను యక్షరంబులను - "పుష్పవిలాపము " కావ్యమందునన్
పదముల పేర్చి గూర్చె మన - భాగ్యవశంబున పాపయార్యుడే !
పద పద మందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన ఖేదమంది,మది - జాలిగ జూచును పూలబాలలన్!

చదువుల తల్లి శారదకు చక్కని రీతుల పిల్లలందరున్
కుదురుగ చేసిరర్పణలు గొప్పగ పద్యపుపద్మమాలికల్,
మదిని ముదమ్మునిండగను మాయమ రాదొకొ తాను ముగ్ధయై!
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

ముదిరిన ప్రాయమందునను ముచ్చట మీరగ శంకరార్యులన్
కుదురుగ కూర్చొనీయకిట కొండొక రీతిని బోరుకొట్టుచున్
చెదరక నేర్చి ఛందమును చేయగ పూరణ లెన్నొ నావియౌ
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్ 😊

పండిత నేమాని గారి పూరణ .....

హృదయములోన ధాతృహృదయేశిని ధ్యానమొనర్చు వేళలో
నొదవు పవిత్ర భావములు, నొప్పుగ పద్యము లల్లబూనుచో
కుదురు సువర్ణ భూషలయి కూరిమి వాణికి, నట్టి కూర్పులన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్

నా పద్యం ....

పదపడి ప్రౌఢనవ్య కవివర్యులు నే డిదె నా సమస్యలన్
ముదమున పూరణంబులను పూర్తియొనర్తురు చిత్రరీతులన్
హృదయము రంజిలన్ మనల కెంతయొ తృప్తి గలుంగ బ్లాగులో
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!

Wednesday, May 23, 2018

82- సమస్య - 2685 (నన్నయాదులు మెచ్చిరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..


"నన్నయాదులు మెచ్చిరి నా కవితను"
(లేదా...)
"నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్"
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

కన్నులు మూసి తల్పమున గాఢ సుషుప్తిని చెందు వేళలో
నెన్నియొ తీపి కోరికలు యింపుగ నుల్లము నందు భాసిలన్
వన్నెల స్వప్నమందు నను వ్రాసితి నెన్నొ ప్రబంధ రాజముల్
నన్నయ తిక్కనాదులె మనంబున మెచ్చిరి నా కవిత్వమున్

కన్నియ యందచందముల గన్నుల కట్టిన రీతి కైతలన్
మిన్నగ వ్రాసినన్ జనులు మెచ్చని వేళన శోకమూర్తినై
కన్నులు మూసి నిద్రఁ జని గాంచితి కమ్మని స్వప్నమొక్కటిన్
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్.

Saturday, March 31, 2018

81 - సమస్య - 2515 (కరణమ్మును నమ్ముకొనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్"
(లేదా...)
"కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా"
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/09/2017 12:02:00 AM 




కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

గోలి హనుమచ్ఛాస్త్రినవంబర్ 09, 2017 10:27 PM
బిరబిర పాలవి పొంగిన
నురుకుచు చేతులనుబట్టి నువు దింపకుమా
తరుణీ!పట్కారను నుప
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్
కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె సం
స్కరణములెన్నొ జేసె నవి కాదని యా నరసింహుపట్ల ధి
క్కరణము జూపి యన్యులకు గౌరవ మీయ నతండు క్రుద్ధుడౌ
కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు ఖచ్చితమ్ముగన్
(ఇక్కడ నేను కరణాన్ని నమ్మేవారు అనే అర్థం లో కాక కరణం ఎవరిని నమ్ముతాడో వారికి సుఖంకలుగుతుందనే అర్థం తో పూరించాను . ఇక్కడ కరణం అంటే పి వి నరసింహా రావు గారు . ఆయన పట్ల అసమ్మతి చూపటం క్షేమం కాదని భావించినట్లు )

Tuesday, November 28, 2017

80 - వీణా బంధ ఉత్పలమాల (శివస్తుతి)

రచయిత :
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కారుణమూర్తి,  కోకనద,   ల్మషకంఠ,     కపాలధారి, కే
దార,యగస్త్య, ధూర్జటి, సదాశివ,యీశ్వర,  లోకపాలకా,
కారణ కారణమ్ము,శివ, గంగపతీ,భవ,  చంద్ర శేఖరా,  
మారిపతీ, యనారతము మమ్ముల గాచుము  లోకరక్షకా. 

  

3 వ్యాఖ్యలు:

  1. కొన్ని లక్షణాలను గమనించాను గానీ వీణాబంధ లక్షణాలను గురించి కొంచెం పూర్తిగా విశదీకరిస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం తృప్తిగా ఉంటుంది.
    ప్రత్యుత్తరంతొలగించు

  2. వీణలో 24 పలకులుంటాయి అందువల్ల 24 అక్షరములు గల పద్యమును ఎంచుకోవాలి అవి సరసిజ,క్రౌoచ పద,అష్టముర్తి మరియు తన్వి అయితే బాగుంటాయి. వీణలో మూడు తీగలు ముఖ్యమట అందువల్ల పద్యము మూడు పాదములలో వ్రాసి చిత్ర మాలికలో వుంచి నాల్గవ పాదము మూడు పాదములలో దాగి వుండాలి . కానీ నేను శ్రీ వల్లభ వఝుల వారు వ్రాసిన ఉత్పల మాల వృత్తపు స్పూర్తి తో వ్రాశాను. తదుపరి ప్రయత్నములో పూర్తీ నియమ నిబంధనలు పాటించుతాను .

    ప్రత్యుత్తరం
  3. పూసపాటి గారూ మీ ఈ ప్రయత్నం ఎంతో మెచ్చుఁకో దగినది.

Monday, November 13, 2017

79 - సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

    1. ఘుమఘుమల పొగాకు గుంటూరులోఁబట్టి
      పిడుగురాళ్ల సుధను ప్రేమఁ జేర్చి
      ఘాటు నాటుకొనగ ఘనముగ నస్యపు
      పొడి యొనర్చువానిఁ బొగడ వశమె||
      ప్రత్యుత్తరం
    2. ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగిన
      మంచి కంది పప్పు కొంచ మైన
      యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
      పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె
      ప్రత్యుత్తరం

      ప్రత్యుత్తరాలు

      1. భళా! వారి అక్కయ్యగారు కందివారి కొసగు కందిపొడి ఉపహారం!

        నమో నమః !

Thursday, August 3, 2017

78 --- సమస్యాపూరణం - 2427 (కాంతుఁడు లేనివేళ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో"

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


అంతము లేని సీరియలు హాస్యము జూపెనొ! లేక యత్తపై
పంతము నెగ్గెనో! మరిదిఁ బారగఁ ద్రోలెనొ! తోడి కోడలే
చెంతకు దేహి యంచు దరి చేరి గులాముగ తాను మారెనో!
కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో!!

వింతగఁ గౌరవాధములు వీర్యము వీడి సభాంతరమ్మునం
గాంతను నేక వస్త్రఁ బరకాంత వివస్త్రను జేయు చుండ గో
త్రాంతక సన్నిభార్జున ఘనాగ్రజుఁ డాగ్రహ తప్త చిత్తుఁడై
కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
కౌరవులు సభలో నొకకాంత నేకవస్త్రను పరకాంతను వివస్త్రను జేయుచుండగా అర్జునిని అన్నగారు తన భర్త కోపము తో గూడిన చిత్తుఁడు కాని వేళ(మౌనముగా) ద్రౌపది (చిత్తవిభ్రమము) తో నవ్వింది! అని నాభావము. 

Monday, July 10, 2017

77 --- సమస్యాపూరణం - 732 (వికలాంగుఁడు రథము నడిపె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :



అకటా! ఒక వస్త్రముతో
నొక సేనయు లేని గాంధి యొందెను జయమున్
సుకవీ! అదియెట్లన్నన్
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్