Monday, August 29, 2016

74 - సమస్య - 2123 (భర్తను బైటకున్ దరిమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"భర్తను బయటకుఁ దరిమె భరతనారి"

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


వార్తల కెక్కగావలయు వైభవ ముంగని సంఘమందు స
త్కీర్తిని పొందగావలయు కేవల మింటవ సించు టేల నీ
వర్తనమార్చుకొమ్మనుచు భవ్యహితంబుల యత్నహీనుడౌ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.

వర్తన మార్చుకొమ్మనుచు భర్తకు నిత్యము చెప్పిచెప్పి యా
ధూర్తుని మార్చలేక మది దుఃఖము చిప్పిల నార్తి తోడుతన్
భర్తను బైటకున్ దరిమె భారతనారి, కళాప్రపూర్ణయై
కర్తగమారి ప్రీతిగను కాచుచు బిడ్డల చేసె త్యాగముల్

అమ్మనాన్నల యాస్తుల నమ్ముకొనుచు
సరకుగొనక కుటుంబము, సంతతమ్ము
త్రాగి వీధిలో తిరుగుచు తగవులాడు
భర్తను బయటకుఁదరిమె భరతనారి

Thursday, June 30, 2016

73 - పద్యరచన - 1226 ( తెలుగు భాష )


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

sailajaజూన్ 28, 2016 9:56 [PM]

దేశభాషలలోన తెలుగెలెస్సయనుచు
..........ఆంధ్రబోజుడు చాటి యాదరించె
సుందరంబగు భాష సురభిలో తెలుగని
............తనివార శ్లాఘించె తమిళకవియె
సాధించి తెలుగున శబ్దకోశము వ్రాసె
..........పాశ్చాత్యుడైనట్టి బ్రౌను దొరయె
దేశదేశములన్ని తెలుగును వినుతింప
.........తెలియు నెప్పుడునీకు తెలుగు వాడ!

పలుకు తేనె పాలు పంచదారల బాష
వేన వేల కవుల వెన్నపూస
ఆది కవుల నోట నలరు కమ్మని భాష
అమ్మ వంటి దయ్య నాంధ్రభాష!!!

సీ: నన్నయార్యుల నోట నాటలాడిన భాష 
తిక్కనెర్రన చేతి తీపి భాష
శ్రీనాధ కవి దిద్దె సింగారముల భాష
పోతన్న గంధంపు పూత భాష
రాయలేలిన నాడు రాటుదేలిన భాష
భువన విజయ మందు కవన భాష
గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
విశ్వనాథుని కల్పవృక్ష భాష 

ఆ.వె: లాలి పాట పాడి లాలించి పాలించి
అమ్మనేర్పినట్టి యమృత భాష
తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
చేయి తలను నిలిపి చేయి బాస.

Sunday, May 15, 2016

72 - ఖండకావ్యము - 23 (పనస పొట్టు కూర)

పనస పొట్టు కూర
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : 
నాకు "మిథునం" సినీమాలో అప్పదాసు గుర్తుకు వస్తాడు. 

రచన : భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్


ఆ.వె.  ఆంధ్ర ప్రాంతమందు అదిరెడు కూరండి !
కోనసీమ రుచులు కోరుకొనిన
మోజుపడుచు తినగ భోజనప్రియు లెల్ల
పనసపొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.  సన్న సెగల పైన సబబుగా నుడికించి
పుల్ల బెల్లమునకు పొట్టు కలిపి
పోపు కలుప చాలు పొట్టుపై ఘుమఘుమ
పనస పొట్టు కూర మనసు నింపు!మిస్సన్న గారి వ్యాఖ్య మే 14, 2016 10:51 [AM]
పనసకాయ దెచ్చి పదునైన కత్తితో
జీలకర్ర వోలె చితుక కొట్టి
ఆవ బెట్టి వండ నదరదా ఆకూర
లొట్ట లేసి తినమ పట్టుబట్టి.

భళ్లమూడివారూ పసందైన కూరలరుచి చూపించారు. అభినందనలు.

Thursday, May 5, 2016

71 - ఖండకావ్యము - 16 (ఋతుచక్రము)


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : ఋతుచక్రము


రచన : లక్ష్మీదేవి

వసంతఋతువు -
ఉ. 
వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం. 
భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ. 
చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ. 
చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం. 
చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ. 
పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.

Monday, May 2, 2016

70 - ఖండకావ్యము - 15 (తెలుఁగు వెలుఁగు)

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట సరసింహ సుబ్బారావు)

పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు.భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుఁగు రుచుల.ఆంధ్రమందునైన అమెరికాలో నైన
వెలుఁగులీను చుండు తెలుఁగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.

Thursday, April 28, 2016

69 - ఖండకావ్యము - 11 (ఋతు సందేశం)

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు)

కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.

Thursday, April 21, 2016

68 - ఖండకావ్యము – 6 (సరస్వతీ!)


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


రచన : లక్ష్మీదేవి


మ.     కరమున్ బట్టుదు పుస్తకంబుమనమున్ కైంకర్యమున్ జేతునీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చెదో,
వరముల్ వేయు నవేల చాలు నదియేవాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

Tuesday, April 19, 2016

67 - పద్యరచన - 1198 (అన్నయ్య)

కవిమిత్రులారా పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


డా.బల్లూరి ఉమాదేవి.ఏప్రిల్ 18, 2016 5:28 [PM]
1.చిక్కు దీసి నీకు చక్కగ జడవేతు
అమ్మ వచ్చు దాక నన్ని నేనె
జోలపాట పాడి జోకొట్టుచును నిన్ను
కంటి రెప్ప వోలె కాతునమ్మ

Thursday, March 10, 2016

66 - సమస్య – 1969 (చంపకమాలకు గణములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చంపకమాలకు గణములు సభరనమయవల్.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
 
పంపితి తెలుగు పరీక్షకు
నింపుగ చందస్సు నేర్పి యిందులకా నీ
దుంపతెగ వ్రాసినావట
చంపకమాలకు గణములు సభరనమయవల్      

Wednesday, January 20, 2016

65 - పద్యరచన - 1152 (ఆటో డ్రైవర్)

కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వంటలు జేయుట కంటెను
కంటను నీరొలికె నేని కష్టము లందున్
చంటిది పాలకు నేడ్చిన
నంటిన బాధ్యతల కొఱకు నాటొ నడుపన్
మిస్సన్నజనవరి 19, 2016 8:37 [AM]
కలమున్ బట్టిరి కావ్యముల్ వెలయగా, గర్జించి రెన్నన్ తుపా
కులు చేదాలిచి గుండెలాగి యరులే కూలంగ యుద్ధాల నే
డిలు సాకంగ కొమారుడై యువతి తానే త్రోలెడిన్ బండి నౌ
నెలతల్ నేర్వగ లేని విద్య గలదే నిండార నేర్పించినన్.
మహిళలు వాహనంబులు ,విమానములే నడుపంగ జూడగా
బహుమతులివ్వకున్న తగుభాద్యత లెంచియుజీవనంబు కై
సహనములందు జేయుచు విశారదు లైరిల నేర్పు కూర్పునన్
అహమును వెళ్ళగొట్టి నబలన్నపదాలనుమార్చివేసిరే|
* గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

చదువున్,చక్కదన౦బు,సభ్యతయు,స౦స్కారమ్ము లున్నట్టి యో
సుదతీ ! వాహన చోదన౦బు తగునే సు౦తేనియున్ ? రక్షణ౦
బది లేదయ్యె సమాజ మ౦దు|వలదమ్మా నీకు దస్సాహస౦|
బొదుగన్ మ౦చిది యాడపిల్ల|సుకుమారోద్యోగము౦. జేయుమా |

( వాహనచోదన౦బు = డ్రై వి ౦ గ్ ; )
ఆడది యాడదంచు నసహాయుల నందురు మూర్ఖు లెల్లరుల్
జూడగ నారులే భువిన శూరులు ధీరులు కార్యదక్షులై
బాడుగ వాహనమ్ము నడుపంగల వారల మంచు చాటగన్
నేడిల నేలు ధైర్యమున నిల్చిరి సాహసు లైరి వారిజల్

Friday, January 15, 2016

64 - సమస్య – 1911 వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె?
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

మదిని దోచిన యందాల మగువ యైన
కలువ కన్నుల జవరాలు కన్నుమీటి
ప్రేమ మీరగ రమ్మంచు పిలవ, తనను
వనిత కామింప నొల్లని వాడు గలడె?

వనిత కామింప నొల్లని వాడు గలడె ?
గలడు గలడు శ్రీరాముడు! కాననమున
శూర్పనఖకోర వలదన్న శూరు డతడె
ధర్మ పథమును వదలని దైవ మతడె !!!