Saturday, June 8, 2019

83 - సమస్యా పూరణం -464 (పదపదమందు శోభిలును)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
(నిజానికి ఇందులో ‘సమస్య’ లేదు. పాదపూరణమే! మీ మీ కవితామాధుర్యాన్ని చవిచూపడమే!)
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్.
ఈ పద్యపాదాన్ని పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

శ్రీపతిశాస్త్రిసెప్టెంబర్ 18, 2011 8:44 AM
శ్రీగురుభ్యోనమ:

వదనము నందు తేజములు వర్ధిలుచుండగ పృచ్ఛకోత్తముల్
ముదమున నిచ్చు ప్రశ్నలకు మోదము నందుచు పద్యపాదముల్
కుదురుగ గూర్చి జెప్పు ఘన కోవిదు నాగఫణీంద్రశర్మకున్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

శ్రీ పతి శాస్త్రి గారూ! చక్కటి పద్యం తో భారతి పాద విభూషణ ధ్వని ని వినిపించారు
పదపద వేడుకొందమిక పల్కుల రాణిని, వేడుకొన్నచో
వదనము నందు జేరు శుభ వాక్కుల వెల్గులు, పద్యమల్లుచో
వదలక వర్ణ వర్ణమున పాదము నిల్పుచు నాట్య మాడుగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

సదమల వేదశాస్త్రముల సారమునంతయుకొంతకొంతగా
పదములయందు, పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని భక్తిగనాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!

అదటది లేనివారు, బలె - యాంధ్రుల పాలిటి యాత్మ బంధువుల్
సదయులు నన్నపార్యు లిల - చక్కగ జెప్పిన భారతమ్మునన్
పదపదమందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన మోదమంది,మది - జారును నూహల లోకమందునన్ !

మృదువగు పూలపై కరుణ - మేలిమి బంగరు భూషణంబనన్
పొదిగెను యక్షరంబులను - "పుష్పవిలాపము " కావ్యమందునన్
పదముల పేర్చి గూర్చె మన - భాగ్యవశంబున పాపయార్యుడే !
పద పద మందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన ఖేదమంది,మది - జాలిగ జూచును పూలబాలలన్!

చదువుల తల్లి శారదకు చక్కని రీతుల పిల్లలందరున్
కుదురుగ చేసిరర్పణలు గొప్పగ పద్యపుపద్మమాలికల్,
మదిని ముదమ్మునిండగను మాయమ రాదొకొ తాను ముగ్ధయై!
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

ముదిరిన ప్రాయమందునను ముచ్చట మీరగ శంకరార్యులన్
కుదురుగ కూర్చొనీయకిట కొండొక రీతిని బోరుకొట్టుచున్
చెదరక నేర్చి ఛందమును చేయగ పూరణ లెన్నొ నావియౌ
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్ 😊

పండిత నేమాని గారి పూరణ .....

హృదయములోన ధాతృహృదయేశిని ధ్యానమొనర్చు వేళలో
నొదవు పవిత్ర భావములు, నొప్పుగ పద్యము లల్లబూనుచో
కుదురు సువర్ణ భూషలయి కూరిమి వాణికి, నట్టి కూర్పులన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్

నా పద్యం ....

పదపడి ప్రౌఢనవ్య కవివర్యులు నే డిదె నా సమస్యలన్
ముదమున పూరణంబులను పూర్తియొనర్తురు చిత్రరీతులన్
హృదయము రంజిలన్ మనల కెంతయొ తృప్తి గలుంగ బ్లాగులో
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!