Thursday, November 27, 2014

39 -- పద్యరచన - 747 (బొప్పాయి)కవిమిత్రులారా పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/26/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
sailaja చెప్పారు...
గొప్పగ విటమినులుండును
ముప్పును తప్పించిమంచి పుష్టిని యిచ్చున్
చప్పున దొరికే ఫలమిది
బొప్పాయిని తినిన చాలు బోవును వ్యాధుల్

ఉదరపు జబ్బులు పోవును
మధరమ్ముగనుండు ఫలము మహిలో జనులే
విధిగా తినినను రోజూ
మదనానపు పండు మంచి మవ్వము నిచ్చున్

Wednesday, November 19, 2014

38 -- పద్యరచన - 739 (జామ పండు)కవిమిత్రులారా  పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/18/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వసంత కిశోర్ చెప్పారు...
ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !
నవంబర్ 18, 2014 2:31 AM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.
నవంబర్ 18, 2014 10:19 AM

Sunday, November 16, 2014

37 -- పద్యరచన - 737 (అవ్వ)కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/16/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

అవ్వా ప్రపంచములో నిన్ను చూసే వాళ్ళు ఎవ్వరూ లేరా! ఎందుకు ఈ వయసులో ఈపని చేస్తున్నావు?  అన్నారు గోలి హనుమచ్ఛాస్త్రి గారు, Chandramouli Suryanarayana గారు.
ఏం నాలుగు మెతుకులు పెట్టే పిల్లలు లేరా! అని Laxminarayan Ganduri  గారు వాపోయారు.
Shankaraiah Boddu గారు ఏమయితే ఏమి తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నిస్తోంది అన్నారు. దానికి sailaja గారు సమర్ధిస్తూ "పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు"  జేజే!!! చెప్పారు.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
అమ్మగ మెలిగిననీవే
అమ్మగ నీ పొత్తములనె యరుదెంచితివా !
ఇమ్ముగ నినుజూచుటకై
ఇమ్మహిలో నెవరులేర యిది దారుణమే !

Chandramouli Suryanarayana చెప్పారు...
అవ్వా నీవీ వయసున
నెవ్వరి యాశ్రయములేక నేకాకివిగా 
నివ్వీధిలోననమ్ముట
యివ్విధముగ పత్రికలను నివ్వెరపరచున్
నవంబర్ 16, 2014 12:59 AM 

Laxminarayan Ganduri చెప్పారు...
ఎనుబది యేండ్లు నిండినవి యెందుకు కష్టము ఫూటుపాతుపై
ననుదిన మిట్టులన్ జనుల కమ్ముచు నుంటివి వార్త పత్రికల్
తనయులు బుక్కెడన్నమును తల్లికి బెట్టని వారలుందురే !
జననము నిచ్చి రాగమున సాకిన త్యాగికి వృద్ద మాతకున్.
నవంబర్ 16, 2014 4:51 PM

Shankaraiah Boddu చెప్పారు...
పుత్రులు లేకనో మరియు పుత్రిక లెవ్వరు చెంతలేకనో
సత్రమునందుభుక్తికయి సాయము గోరక కష్టమొందుచున్
చిత్రముగా ప్రయత్నమును జేయుచు నున్నది కాలిబాటపై
పత్రిక లమ్ముచున్ ముసలి బామ్మ శ్రమించుచు పొట్టకూటికై
నవంబర్ 16, 2014 5:53 PM

sailaja చెప్పారు...
హస్తములు వణుకు వయసున
పుస్తకముల నమ్ముచున్న ముదుసలి గనరే!
మస్తకమున తెలివి గలిగి
పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు జేజే!!!

Wednesday, November 12, 2014

36 -- పద్యరచన - 733 (సీతాఫలం)కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/12/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

లక్ష్మీదేవి చెప్పారు...
రూపముఁ జూడగా జనులు రోసియు వీడరు కొన్ని పండ్లనే
లోపముఁ గానరాదనగ లుబ్ధతతో తిని సొక్కుచుందురీ
తీపి ఫలమ్ములన్; వనుల తీరుగ పండు మృగాళికెల్ల క్షు
త్తాప నివారణమ్మవగ ధాత్రి యొసంగు వరమ్ము భంగినిన్.
నవంబర్ 12, 2014 1:05 PM

Saturday, November 8, 2014

35 -- పద్యరచన - 729 (చిన్నారి విన్నీ)
కవిమిత్రులారా పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/08/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

Timmaji Rao Kembai చెప్పారు...
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పద్య రచన విరిబాల

బాలిక సోయగమ్ముగన బంతి సుమమ్ములు పూచె నావనిన్
మేలిమి నున్నబుగ్గలను మెల్లగతాకెను తన్మయమ్మునన్
మీలిత కన్నులన్ చిరుత మించు సువాసన లాశ్వసించగా
మాలిమిజేసె నీ ప్రకృతి మాత యొసంగుచు దీవెనల్ సదా
నవంబర్ 08, 2014 12:36 PM

Wednesday, November 5, 2014

34 -- సమస్యా పూరణం - 1543 (వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య.)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/04/2014 12:10:00 AM

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Laxminarayan Ganduri గట్టిగా చెప్పారు ...
వల్ల కాటికి జేరెడు వయసు నీది
యీదు చుంటివి కడురోగ పుదతిలోన
మూడు కాళ్ళతో నడిచెడి మూర్ఖ! యేల
వార్ధకమ్మున గావలె బడుచు భార్య?
నవంబర్ 04, 2014 8:02 PM


Chandramouli Suryanarayana ఇంకా గట్టిగా చివాట్లు పెట్టారు ...
పెళ్లి గోలేల వృద్ధుఁడ వెళ్ళవయ్య
జుట్టు నెరిసెను కనులేమొ సొట్ట బోయె
నడుము వంగెను నలుగురు నవ్వ, నేల
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య?
నవంబర్ 04, 2014 12:54 AM

Timmaji Rao Kembai  గారు పైవారిద్దరికీ మంచి సమాధానం చెప్పారు...
వయసు నందు న౦తరములు పతి సతులకు
హెచ్చుగానుండ భర్తకు నిబ్బడిగను
ప్రేమ పెరుగును భార్యపై ,పిదప తనకు
వార్ధకమ్మున గావలె పడుచు భార్య
సేవ లొనరింప నుండును సిద్ధముగను
నవంబర్ 04, 2014 6:14 PM

గోలి హనుమచ్ఛాస్త్రి గారు దానిని చక్కగా వర్ణించారు ...
వయసునందున ప్రేమించ " బడుచు భార్య "
వాదులాటల గొడవలు " బడుచు భార్య "
పలువిధమ్ములుగా సాయ " బడుచు భార్య "
వార్ధకమ్మునఁ గావలెఁ " బడుచు భార్య."

Sunday, November 2, 2014

33 -- సమస్యా పూరణం - 1542 (దీపముఁ బెట్టంగఁ దగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్"

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/02/2014 07:29:00 AM

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Chandramouli Suryanarayana చెప్పారు...
నిన్నటినించి బ్లాగ్ చూడకపోవుట వలన మాస్టారి అనారోగ్యము గురించి తెలియ లేదు. మాస్టారు త్వరగా కోలుకోన ఆ భగవంతుని ప్రార్ధించెదను 

మాపుము తలపై దెబ్బను
కాపాడుము శంకరార్యు కరుణను నని నే
నా పరమాత్ముని వేడుచు
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్