Thursday, March 26, 2015

54 - పద్య రచన - 859 (శంకరుడి ఆభరణం)




కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/25/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యములు :

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
కంది వారి తోట కవనంపు విరులంట
పద్య విద్య యందు ప్రాజ్ఞు లంత
శంక రాభ రణము సాటివే రేదని
వేలు పనుచు గురువు వేడె భక్తి
మార్చి 25, 2015 3:12 [AM]

మిస్సన్న చెప్పారు...
కవనవైభవ మన్న కమనీయ హారాన
........తాపిన మణులు పద్యము లనంగ
సరసచమత్కృతుల్ సందడి జేసెడు
........పూరణ రత్నాలు పొదిగి రనగ
ధగధగ మెరయుచు తాకుచు హృదయాల
........దత్తపదీ వజ్ర తతులు నిగుడ
పద్యరచనములన్ ప్రభల నుద్దీపించు
........పచ్చలు భాసింప ముచ్చటగను

తనరు మహనీయ విష్ణునందనుల వంటి
కవికులాన్వయ చంద్రుల కైత లనెడు
పగడముల నుంచి శంకర భవ్య శిల్పి
చేసె శంకరాభరణమ్ము భాసురముగ.
మార్చి 25, 2015 6:40 [PM]

Wednesday, March 18, 2015

53 - న్యస్తాక్షరి - 21 (బమ్మెర పోతన)


న్యస్తాక్షరి - 21
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :

జిగురు సత్యనారాయణ చెప్పారు...
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్

Wednesday, March 11, 2015

52 - పద్యరచన - 845 (అద్దంతో మా ఆవిడ)



కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/11/2015 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
నారంభా నా యూర్వసి
చేరంగా రావెయంచు చెంతనె రోజున్
తీరుగ జెప్పి యబద్ధము
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.
మార్చి 11, 2015 7:53 [AM]

Sunday, March 1, 2015

51 - సమస్యాపూరణం – 1129 (మనము శాంతించు నెన్నొ సమస్య లున్న)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
"మనము శాంతించు నెన్నొ సమస్య లున్న".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 7/31/2013 06:00:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Zilebi చెప్పారు...
సడలి బడలి ఇంటికి రావంగ
మురిపెంగ గృహిణి సేద తీరనీయంగ
మనంబున సంతోషమ్ము ఉరకలేయంగ,
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న!
జులై 31, 2013 6:38 [AM]

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
శ్రీమతి జిలేబీ గారిభావానికి నాపద్యరూపము......

పలుతెఱంగులనుద్యోగ బడలికలను
మరువజేయంగ నేర్చిన మహిత మూర్తి
పతిని సేవించునట్టి సద్భార్యవలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న.

నేటికార్యాలయమ్మునందాటుపోట్లు
ఘోర రహదారి పయనంబు గూర్చు నట్టి
బాధ మరిపించి మురిపించు భార్య వలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న
జులై 31, 2013 3:36 [PM]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
పసిడి ముద్దుల నగవుల మిసిమి తనయ
చేరి యొడి లోన కిలకిల చిలుక పలుకు
చుండ పులకించి సంతస మొందినంత
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న
జులై 31, 2013 10:10 [PM]

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
మనమునందున భయమును మసలనీక
నేది జరిగిన మనమంచికేననుచు
ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న