Monday, June 30, 2014

016 - పద్యరచన - 606 (కవి జీవితం)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
Chandramouli Suryanarayana చెప్పారు...
చిరుగు చొక్కాను తొడిగినా చింతలేదు
బియ్యమే లేకపోయినా బెంగలేదు
ఊహలందున విహరించుచుండు నెపుడు
కవుల భార్యల బాధలు కాంచలేము

Sunday, June 29, 2014

015 - పద్యరచన - 605 (శంకరుడు)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు: 

మిస్సన్న చెప్పారు...


హరహర శంకరా యనుచు నార్తిని వేడిన సర్వ సంపదల్
వరముగ నిత్తువంచు విని పర్వదినమ్ముల నీదు పూజలన్
కరమొనరించు భక్తులకు కన్నులపండువు నీ విభూతులౌ
మరియొక జన్మ లేదుగద మాలిమి నీవు బిరాన నేలుటన్.

లింగము చెంత జేరి గన లేదిక పాపము దాని భక్తితో
గంగను జేయ షేచనము కానిది జన్మ మరొక్క మారు నా
బెంగ యిదే కదా భవపు భీతిని బాపెడు దేవ కాశి మా
ముంగిట నున్న గాని నిను మోదముతో దరిశింప నైతినే. 
లక్ష్మీదేవి చెప్పారు...
ఈరోజు జగత్ప్రసిద్ధమైన శ్రీజగన్నాథ రథయాత్ర సందర్భంగా...
జనులనుఁ జూడగా కదలి చల్లగ వచ్చితివా జగత్ప్రభూ!
మనమున నింత కింత కృప మాపయి చూపగ లోకనాథుడా!
దినదినమిట్టి లోకమున దీనత నొందితిమయ్యదేవుడా!
కనులను విప్పి నీదరిని గైకొనవయ్య జగత్పతీ! హరీ!

Friday, June 20, 2014

014 - సమస్యా పూరణం - 1450 (కాకి కాకి కాక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కాకి కాకి కాక కేకి యగునె?
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు: 

కంది శంకరయ్య చెప్పారు...
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

విషపు పాముఁ దెచ్చి ప్రేమతోఁ బెంచిన
కాటు వేసి తుదకు చేటు దెచ్చు
వక్రబుద్ధివాఁడు పావనుం డగునెట్లు
కాకి కాకి కాక కేకి యగునె.

కేకి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912    Report an error about this Word-Meaning    గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. న్‌. పుం. 
  • మయూరము, నెమలి.

Monday, June 16, 2014

013 - సమస్యాపూరణం - 1338 (మల్లెతీఁగకు పూచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల్లెతీఁగకు పూచె చేమంతులెన్నొ.Pandita Nemani చెప్పారు...
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.

మా మనుమరాలు కళల పద్మజుని యాలు
సిరుల బేర్కొను నెడల శ్రీధరుని యాలు
వరలు సౌభాగ్యమెన్న శంకరుని యాలు
ముద్ద బంగార మనదగు ముద్దరాలు
మానినీమణి యలివేణి మల్లెతీగ!
కొప్పునన్ పుష్ప మాలికల్ కొల్వుతీరె
నట్టి పూబోడి మరియింత నందగింప
మల్లెతీగకు పూచె చేమంతులెన్నొ!
పండిత నేమాని వారూ,
‘మల్లెపూవువంటి మనుమరాలి ఒంటినిండ చేమంతులు...’ మనోహరమైన భావం. చక్కని పూరణ. అభినందనలు.
మనుమరాలిని ముగ్గురమ్మల బోలు పుత్తడిబొమ్మగా వర్ణించిన పద్యం చాలా బాగుంది.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ముగ్ధమనోహరమైన భావంతో పూరణ చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
*
మార్చి 01, 2014 2:13 PM
Sunday, June 15, 2014

012 - పద్యరచన - 587 (రిక్షా)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Chandramouli Suryanarayana చెప్పారు...

చెమటలు కారుచుండ తన చేతుల లాగుడు బండి లాగుచున్
కమిలెను మోము, ఎండలకు కందె శరీరము, వాని గాంచినన్
చెమరును నేత్రముల్, తనకు చెప్పులు కాలికి లేకపోయినన్
కుమలక, చేర్చు, యాత్రికులు కూర్చొన వారిని, వారి గమ్యమున్
గుడిసెలలో వసించుచును కూటికి లేక నుపాధి లేక య
ట్టడుగున చాల పేదరిక మందున మ్రగ్గచు బాధ లొందుచున్
బడలిక లేక జీవితము బండిని లాగుచు వెళ్ళ బుత్తు రా
బడుగుల బాగుజేయ గల బాధ్యత నెవ్వరు తీసుకుందురో!


Wednesday, June 11, 2014

011 - పద్యరచన - 586 (చిన్నారి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వడ్డాది ఉదయకుమార్ గారికి ధన్యవాదాలతో...

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Pandita Nemani చెప్పారు...
జ్ఞాన దీప్తులు మోము కంజాతమును నిండె
....పలుకుల తల్లి యా పసిడి బొమ్మ
వివిధ శోభల తోడ విలసిల్లు చున్నది
....శ్రీమహాలక్ష్మి యా చిట్టితల్లి
సౌభాగ్యరేఖల చాల వెల్గుచునుండె
....శంభు నర్థాంగి యా సన్నుతాంగి
ముగ్గురమ్మలకును మూలపుటమ్మయౌ
....ఆదిపరాశక్తి యా మనోజ్ఞ
ఆమె సద్గుణగణముల కాటపట్టు
కట్టు బొట్టుల కామెచే కలిగె ఠీవి
సాటి వారలలో నామె స్వర్ణభూష
అచ్చముగ నామె ఆంధ్రుల యాడుబిడ్డ 
Chandramouli Suryanarayana చెప్పారు...
చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్
భారత సంప్రదాయములు బాగుగ వృద్ధిని పొందచూడ నా
కోరిక తీరునేమొనని కొంచెముగా చిగురించెనాశయున్
చంద్రమౌళి రామారావు గారి పూరణ:

భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి
న్నారికి, నారికే యిట మనన్ భయమౌ ప్రియ దైవమా! నమ
స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్
సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువై
మిస్సన్న చెప్పారు...
గురువుగారి కోరిక ననుసరించి ముఖపుస్తకము లోని నా పద్యము:

పోకముడిని బట్టి పొల్పు మీరగ జుట్టి
......కుచ్చెళ్ళు తగ బెట్టి కోక గట్టి

జాకెట్టు ధరియించి జారు పైటను దిద్ది
......మొలనూలు బిగియించి మురిపెమొదవ

పైటకొం గెగురంగ పదపడి గాలికి
......పై యంచు కనుపింప పట్టి చేత

వెనుక విలాసమై తనరార వాల్జడ
......నంచలు సిగ్గిల నడుగు లిడుచు

తెలుగు నట్టింట నడయాడు కలికి జూచి
నింగి వేలుపు లెల్లరు పొంగి పోయి
సిరుల జల్లుగ కురియరే చెలువు మీర
చీర కట్టుకు సరియేది చిన్నదాన!


Monday, June 9, 2014

010 - సమస్యా పూరణం - 1439 (పడుచు కోరికల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం

Shankaraiah Boddu చెప్పారు...
పడుచుతనములోన చిలిపి పనులు జేసి
వయసుమళ్ళిన ముదుసలి వయసులోన
గతపు చేష్టలు సతతము మతికి రాగ
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున!

Saturday, June 7, 2014

009 - సమస్యాపూరణం – 1420 (బహుపత్నీవ్రతమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)

శైలజ గారూ,
మంచి పూరణ అందించారు. అభినందనలు.
‘సుఖముల నొసగెడి’ అనండి.
మే 22, 2014 9:52 AM

Tuesday, June 3, 2014

008- పద్య రచన – 578 (తెలంగాణ)

కవిమిత్రులారా,

 పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
Pandita Nemani గారు చెప్పారు...

కలకాలమ్ము సమస్త సంపదల కాగారమ్ము కేదారమై
యలరుం గాక! వినూత్న రాష్ట్రము తెలంగాణా మహాదర్శ కాం
తులు దిగ్వీధులలో ప్రశంసితములై ద్యోతింప రమ్యమ్ములై
యిలకున్ భూషణమై సుధీనిలయమై హృద్యప్రదీపంబునై
జూన్ 02, 2014 8:32 PM

Pandita Nemani చెప్పారు...
జయ తెలంగాణ!

ఆనంద హేలయై యావిర్భవించిన
....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
జనగణాకాంక్షల సాకార రూపమౌ
....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
చెన్నొదవెడు పది జిల్లాల భాగ్యమౌ
....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
ప్రగతి పథమ్ములో పరవళ్ళు త్రొక్కెడు
....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
జయము భూదేవి రత్న భూషణ వరమ్మ!
జయము సంక్షేమ పర్వమా! జయము జయము
జయము సౌజన్య నిలయమా! జయము జయము
జయ తెలంగాణ రాష్ట్రమ! జయము జయము

Monday, June 2, 2014

007 - పద్య రచన – 575

పద్య రచన – 575

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం
sailaja చెప్పారు...తలనీలాలను తీయగ
వలవల మనియేడ్చుశిశువు భాధకు లోనై
తలపై గంధము పూయగ
కిలకిలమని నవ్వుచుండె కేరింతలతో

Sunday, June 1, 2014

006 - సమస్యాపూరణం – 1424 (తారలు మధ్యాహ్నవేళ)

సమస్యాపూరణం – 1424 (తారలు మధ్యాహ్నవేళ)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...
తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం

నాగరాజు రవీందర్ చెప్పారు...

చీరల కొరకై యొక సతి
పోరుచు తన మగని తోడ మోదగ తలపై
ధారుణిపై బడిన పతికి
తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.