Tuesday, August 26, 2014

26 --- సమస్యా పూరణం – 1508 (కామదాసులైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కామదాసులైనఁ గలుగు ముక్తి
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

కామేశ్వర శర్మ శ్రీఆదిభట్ల చెప్పారు...
కామి కానివాడు కాబోడు తామోక్ష
కామి యనెడు మాట కలదు భువిని
తలచెనొకడు దాని తప్పుగా నీరీతి
కామ దాసులైన కలుగు ముక్తి.
ఆగస్టు 26, 2014 10:02 AM

sailaja చెప్పారు...
బాల కుండు చదివె బడిలోన పద్యము
కామ దాసు లైన కలుగు ముక్తి
అచ్చుత ప్పటంచు ననుయోక్త సరిదిద్దె
కాళి దాసు లైన కలుగు ముక్తి
ఆగస్టు 26, 2014 12:07 PM

Friday, August 22, 2014

25 - సమస్యా పూరణం – 1506 (అమ్మా యని పిలువగానె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్. 
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Chandramouli Suryanarayana చెప్పారు...
అమ్మా! యిదిగో గనుమీ
యమ్మాయే నీకు కోడలని సుతుడన యా
యమ్మాయేమో హాయ
త్తమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్
(హాయ్+ అత్తమ్మా )
Annapareddy satyanarayana reddy చెప్పారు...
ఇమ్మగు రూపున నూర్వసి
కమ్మనిసుఖముల నిడుమని కవ్వడిఁ గోరన్
చిమ్మ తిరిగి యాతనిమది
యమ్మా యని పిలువగానె యాగ్రహ మందెన్
శ్రీగురుభ్యోనమ:

నమ్ముచు నాంగ్లపు చదువుల
నమ్మా యని పిలువగానె యాగ్రహ మందెన్
"మమ్మీ యనరా వెధవా
కమ్మగ" యని సుతుని దిట్టె గంభీరముగా
Wednesday, August 20, 2014

24 - దత్తపది - 39 (గద్యము-పద్యము-మద్యము-హృద్యము)

కవిమిత్రులారా!
గద్యము - పద్యము - మద్యము - హృద్యము
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో 
కవిత్వప్రయోజనాన్ని వివరిస్తూ పద్యం వ్రాయండి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

గద్యము శబ్ద వాద్యముల ఘల్లను కంకణ నిక్వణ మ్మిడన్
పద్యము రాగతాళ యుత భావన,స్పందన,స్ఫూర్తి నీయగా
హృద్యములైన కావ్యములు సృష్టిని జేయుము విశ్వ శ్రేయమై
మద్యము గ్రోల నేమగును మైమరపే గద బుద్ధి మాంద్యమున్
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
పద్యము జదివితి తిక్కన
గద్యమునే చదివినాడ కావ్యమునందున్
హృద్యముగా నుందంటిని
మద్యము గోలెందుకయ్య మధ్యన గ్రోలన్.

Tuesday, August 12, 2014

23 - పద్యరచన - శ్రద్ధాంజలి! (శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు)


సుకవి, యధ్యాత్మ రామాయణ కృతికర్త,
మాన్యగురుదేవుఁడైన నేమాని రామ
జోగి సన్యాసి రావుకు శోకతప్త
మైన హృదయ మర్పించు శ్రద్ధాంజలి యిది! .... (కంది శంకరయ్య)

నేమాని పండితార్యులు
భూమిని విడి వాడిపోని పూవై సీతా
రాముల పదముల వ్రాలగ
నేమో దివికేగి నారు యీ దిన మయ్యో ! .... (మిస్సన్న)

 సీ.
 శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
 స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
 తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
 రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
 తే.గీ.
 ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
 నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
 స్వర్గమేగిన నేమాని పండితార్య!
 మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత! .... (గుండు మధుసూదన్)


అష్టావధానమ్ములతిమనోహరముగ
....... వెలయించినట్టి ప్రావీణ్యయుతులు
పద్యవిద్యావైభవమునెల్ల జగతిన
....... వ్యాపింపజేసిన ప్రథితకవులు
నధ్యాత్మరామాయణాది కావ్యంబుల
....... సృజియించినట్టి సంస్థితుఁడవీవు
భావికవులకెల్ల ప్రామాణికమ్ముగా
....... భావింపదగిన విభ్రాజితుండు

శంకరాభరణమ్మున సంశయములఁ
దొలఁగజేయుచు జ్ఞానమ్ము కలుఁగజేసె !!
పండితోత్తమనేమాని వర్య మీదు
యాత్మ శాంతిని పొందగానభిలషింతు. ... (సంపత్ కుమార్ శాస్త్రి) 

శ్రీపతిశాస్త్రి చెప్పారు...
శ్రీగురుభ్యోనమ:

భారతి కంఠహారమున భాస్కరతేజము ప్రజ్వలింపగా
కారణమేమిటో యనుచు కాంచగ,కన్ గొని విస్మయంబునన్
భారములాయె నాకనులు భాష్పపుధారలుగారుచుండగా !
మా రవితేజపండితుడు మమ్ముల వీడెను ముక్తినొందుచున్

రామాయణ కృతికర్తా
ప్రేమగ మము తీర్చిదిద్దు పెద్దన సముడౌ
నేమాని పండితార్యా
స్వామీ, శ్రద్ధాంజలిదియె పావనమూర్తీ !

గురువర్యులు శ్రీ పండితనేమాని కవీవీశ్వరుడు పరమపదినించినారను విషయమును బ్లాగు మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి ద్వారా తెలిసినది. మిగుల దు:ఖకరమైన విషయము. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు జయప్రదముగా నిర్వహించుచున్న భువనవిజయము వంటి శంకరాభరణము నందు మహాకవి పెద్దన వలె మనకు యెన్నో అమూల్యమైన సూచనలను, భాషా సంపత్తిని,కవితామృతమును అందించిన గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కల్గి ఆ సరస్వతి సన్నిధానమున సేవలనందింతురని ప్రార్థించుచున్నాను.

Rao S Lakkaraju చెప్పారు...
శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త ఇప్పుడే చూశాను చాలా బాధ కలిగించింది. వారిని న్యుజేర్సి లో కలుద్దామనుకున్నా కానీ వీలు కలుగలేదు. శంకరాభారణంలో భాగంగా ఉన్న మనందరికీ వారు ముఖ్యులు. వారు లేని లోటును తీర్చటం చాలా కష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక.

Saturday, August 2, 2014

22 - పద్యరచన - 639 (పల్లె పిల్ల)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.


 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
గుండా వేంకట సుబ్బ సహ దేవుడు చెప్పారు...
చక్కని చీరను దీర్చెను
పిక్కల పైదాక, కొంగు బిగచుట్టగ పై
నిక్కిన సోయగ మదిరెన్
జిక్కదె మది గడ్డి మోపు చేతుల కెత్తన్?