Thursday, June 30, 2016

73 - పద్యరచన - 1226 ( తెలుగు భాష )


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

sailajaజూన్ 28, 2016 9:56 [PM]

దేశభాషలలోన తెలుగెలెస్సయనుచు
..........ఆంధ్రబోజుడు చాటి యాదరించె
సుందరంబగు భాష సురభిలో తెలుగని
............తనివార శ్లాఘించె తమిళకవియె
సాధించి తెలుగున శబ్దకోశము వ్రాసె
..........పాశ్చాత్యుడైనట్టి బ్రౌను దొరయె
దేశదేశములన్ని తెలుగును వినుతింప
.........తెలియు నెప్పుడునీకు తెలుగు వాడ!

పలుకు తేనె పాలు పంచదారల బాష
వేన వేల కవుల వెన్నపూస
ఆది కవుల నోట నలరు కమ్మని భాష
అమ్మ వంటి దయ్య నాంధ్రభాష!!!

సీ: నన్నయార్యుల నోట నాటలాడిన భాష 
తిక్కనెర్రన చేతి తీపి భాష
శ్రీనాధ కవి దిద్దె సింగారముల భాష
పోతన్న గంధంపు పూత భాష
రాయలేలిన నాడు రాటుదేలిన భాష
భువన విజయ మందు కవన భాష
గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
విశ్వనాథుని కల్పవృక్ష భాష 

ఆ.వె: లాలి పాట పాడి లాలించి పాలించి
అమ్మనేర్పినట్టి యమృత భాష
తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
చేయి తలను నిలిపి చేయి బాస.

No comments:

Post a Comment