Showing posts with label శంకరాభరణం అశ్రుతర్పణం. Show all posts
Showing posts with label శంకరాభరణం అశ్రుతర్పణం. Show all posts

Tuesday, August 12, 2014

23 - పద్యరచన - శ్రద్ధాంజలి! (శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు)


సుకవి, యధ్యాత్మ రామాయణ కృతికర్త,
మాన్యగురుదేవుఁడైన నేమాని రామ
జోగి సన్యాసి రావుకు శోకతప్త
మైన హృదయ మర్పించు శ్రద్ధాంజలి యిది! .... (కంది శంకరయ్య)

నేమాని పండితార్యులు
భూమిని విడి వాడిపోని పూవై సీతా
రాముల పదముల వ్రాలగ
నేమో దివికేగి నారు యీ దిన మయ్యో ! .... (మిస్సన్న)

 సీ.
 శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
 స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
 తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
 రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
 తే.గీ.
 ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
 నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
 స్వర్గమేగిన నేమాని పండితార్య!
 మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత! .... (గుండు మధుసూదన్)


అష్టావధానమ్ములతిమనోహరముగ
....... వెలయించినట్టి ప్రావీణ్యయుతులు
పద్యవిద్యావైభవమునెల్ల జగతిన
....... వ్యాపింపజేసిన ప్రథితకవులు
నధ్యాత్మరామాయణాది కావ్యంబుల
....... సృజియించినట్టి సంస్థితుఁడవీవు
భావికవులకెల్ల ప్రామాణికమ్ముగా
....... భావింపదగిన విభ్రాజితుండు

శంకరాభరణమ్మున సంశయములఁ
దొలఁగజేయుచు జ్ఞానమ్ము కలుఁగజేసె !!
పండితోత్తమనేమాని వర్య మీదు
యాత్మ శాంతిని పొందగానభిలషింతు. ... (సంపత్ కుమార్ శాస్త్రి) 





శ్రీపతిశాస్త్రి చెప్పారు...
శ్రీగురుభ్యోనమ:

భారతి కంఠహారమున భాస్కరతేజము ప్రజ్వలింపగా
కారణమేమిటో యనుచు కాంచగ,కన్ గొని విస్మయంబునన్
భారములాయె నాకనులు భాష్పపుధారలుగారుచుండగా !
మా రవితేజపండితుడు మమ్ముల వీడెను ముక్తినొందుచున్

రామాయణ కృతికర్తా
ప్రేమగ మము తీర్చిదిద్దు పెద్దన సముడౌ
నేమాని పండితార్యా
స్వామీ, శ్రద్ధాంజలిదియె పావనమూర్తీ !

గురువర్యులు శ్రీ పండితనేమాని కవీవీశ్వరుడు పరమపదినించినారను విషయమును బ్లాగు మిత్రులు శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి ద్వారా తెలిసినది. మిగుల దు:ఖకరమైన విషయము. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు జయప్రదముగా నిర్వహించుచున్న భువనవిజయము వంటి శంకరాభరణము నందు మహాకవి పెద్దన వలె మనకు యెన్నో అమూల్యమైన సూచనలను, భాషా సంపత్తిని,కవితామృతమును అందించిన గౌరవనీయులు శ్రీ పండిత నేమాని గురువర్యుల ఆత్మకు శాంతి కల్గి ఆ సరస్వతి సన్నిధానమున సేవలనందింతురని ప్రార్థించుచున్నాను.

Rao S Lakkaraju చెప్పారు...
శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు గారు శివైక్యము చెందిన వార్త ఇప్పుడే చూశాను చాలా బాధ కలిగించింది. వారిని న్యుజేర్సి లో కలుద్దామనుకున్నా కానీ వీలు కలుగలేదు. శంకరాభారణంలో భాగంగా ఉన్న మనందరికీ వారు ముఖ్యులు. వారు లేని లోటును తీర్చటం చాలా కష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక.