Monday, July 10, 2017

77 --- సమస్యాపూరణం - 732 (వికలాంగుఁడు రథము నడిపె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :



అకటా! ఒక వస్త్రముతో
నొక సేనయు లేని గాంధి యొందెను జయమున్
సుకవీ! అదియెట్లన్నన్
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్

Monday, January 30, 2017

76 - గమ్మత్తైన పద్యం


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.
ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.

"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో నః॥ ఆశ్చర్య పోయాడు చదవగానే.
అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.

అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.
చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.
ఇది మరో ఆశ్చర్యం.
అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.

ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.

విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
('అనంత్ మూగి' గారికి ధన్యవాదాలతో...)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 1/24/2017 12:03:00 AM వద్ద 1/24/2017 12:03:00 AM

Thursday, January 26, 2017

75 - సమస్య - 2262 (తరుణి! పుత్రివో?...)


కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?"
లేదా...
"రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?"

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వలపు సంకెళ్ళు బిగియించు కులుకు చెలివొ
తనువు పులకించి మురిపించి తనరు పుత్రి
మధువు చిలికించి సుధలూరు మనుమ రాల
తరుణి ! పుత్రివో ? పౌత్రివో ? ధర్మ సతివొ ?
సుమముల వంటి స్వచ్ఛతయు సున్నిత దేహము నీకుస్వంతమే
యమృతమయమ్ము నీహృదయమాపరమేశుని మారురూపువే
మమతను పంచిపెట్టుచు సమాజమునందుననర్ధభాగమౌ
రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో

Monday, August 29, 2016

74 - సమస్య - 2123 (భర్తను బైటకున్ దరిమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై"
(ఒక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"భర్తను బయటకుఁ దరిమె భరతనారి"

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


వార్తల కెక్కగావలయు వైభవ ముంగని సంఘమందు స
త్కీర్తిని పొందగావలయు కేవల మింటవ సించు టేల నీ
వర్తనమార్చుకొమ్మనుచు భవ్యహితంబుల యత్నహీనుడౌ
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై.

వర్తన మార్చుకొమ్మనుచు భర్తకు నిత్యము చెప్పిచెప్పి యా
ధూర్తుని మార్చలేక మది దుఃఖము చిప్పిల నార్తి తోడుతన్
భర్తను బైటకున్ దరిమె భారతనారి, కళాప్రపూర్ణయై
కర్తగమారి ప్రీతిగను కాచుచు బిడ్డల చేసె త్యాగముల్

అమ్మనాన్నల యాస్తుల నమ్ముకొనుచు
సరకుగొనక కుటుంబము, సంతతమ్ము
త్రాగి వీధిలో తిరుగుచు తగవులాడు
భర్తను బయటకుఁదరిమె భరతనారి

Thursday, June 30, 2016

73 - పద్యరచన - 1226 ( తెలుగు భాష )


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

sailajaజూన్ 28, 2016 9:56 [PM]

దేశభాషలలోన తెలుగెలెస్సయనుచు
..........ఆంధ్రబోజుడు చాటి యాదరించె
సుందరంబగు భాష సురభిలో తెలుగని
............తనివార శ్లాఘించె తమిళకవియె
సాధించి తెలుగున శబ్దకోశము వ్రాసె
..........పాశ్చాత్యుడైనట్టి బ్రౌను దొరయె
దేశదేశములన్ని తెలుగును వినుతింప
.........తెలియు నెప్పుడునీకు తెలుగు వాడ!

పలుకు తేనె పాలు పంచదారల బాష
వేన వేల కవుల వెన్నపూస
ఆది కవుల నోట నలరు కమ్మని భాష
అమ్మ వంటి దయ్య నాంధ్రభాష!!!

సీ: నన్నయార్యుల నోట నాటలాడిన భాష 
తిక్కనెర్రన చేతి తీపి భాష
శ్రీనాధ కవి దిద్దె సింగారముల భాష
పోతన్న గంధంపు పూత భాష
రాయలేలిన నాడు రాటుదేలిన భాష
భువన విజయ మందు కవన భాష
గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
విశ్వనాథుని కల్పవృక్ష భాష 

ఆ.వె: లాలి పాట పాడి లాలించి పాలించి
అమ్మనేర్పినట్టి యమృత భాష
తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
చేయి తలను నిలిపి చేయి బాస.

Sunday, May 15, 2016

72 - ఖండకావ్యము - 23 (పనస పొట్టు కూర)

పనస పొట్టు కూర
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : 
నాకు "మిథునం" సినీమాలో అప్పదాసు గుర్తుకు వస్తాడు. 

రచన : భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్


ఆ.వె.  ఆంధ్ర ప్రాంతమందు అదిరెడు కూరండి !
కోనసీమ రుచులు కోరుకొనిన
మోజుపడుచు తినగ భోజనప్రియు లెల్ల
పనసపొట్టు కూర మనసు నింపు!

ఆ.వె.  సన్న సెగల పైన సబబుగా నుడికించి
పుల్ల బెల్లమునకు పొట్టు కలిపి
పోపు కలుప చాలు పొట్టుపై ఘుమఘుమ
పనస పొట్టు కూర మనసు నింపు!



మిస్సన్న గారి వ్యాఖ్య మే 14, 2016 10:51 [AM]
పనసకాయ దెచ్చి పదునైన కత్తితో
జీలకర్ర వోలె చితుక కొట్టి
ఆవ బెట్టి వండ నదరదా ఆకూర
లొట్ట లేసి తినమ పట్టుబట్టి.

భళ్లమూడివారూ పసందైన కూరలరుచి చూపించారు. అభినందనలు.

Thursday, May 5, 2016

71 - ఖండకావ్యము - 16 (ఋతుచక్రము)


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : ఋతుచక్రము


రచన : లక్ష్మీదేవి

వసంతఋతువు -
ఉ. 
వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం. 
భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ. 
చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ. 
చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం. 
చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ. 
పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.