Saturday, October 24, 2015

61 -- సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్."
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 10/20/2015 12:02:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు : 

కలములు పట్టబోరిపుడు కాగితమక్కర లేదు వ్రేలితో
తళుకుల నీను యంత్రమున ధాటిగ ఛాటులనాడు వారికిన్
కళలును భాషయున్ మధురకావ్యము లెందుల కాంగ్ల బానిసల్
లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్
పలువిధ కష్టనష్టముల పాలయి జీవనయాన మందునన్
నిలువగ నీడయున్ కడుపునిండుగ కూడును లేనివారలన్
తలచుచు సాటిమానవుల తక్షణరక్షనొనర్చ మేలగున్

Sunday, October 18, 2015

60 -- సమస్యాపూరణ - 1770 (ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్."
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 8/26/2015 12:02:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

శ్రీగురుభ్యోనమ:

మెండగు విషయమ్ములతో
పండిన యీ పద్యతోట పరికించుటకై
యండగ నంతర్ జాల
మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్.

అండగ నిలిచెడు దేవిని
పండగ రోజంటు భార్య భక్తిన గొలవన్
దండిగ శోభించిన చా
ముండను వీక్షించి మగడు మోదము నందెన్

మెండగు భక్తిన్ దంపతు
లండ శివుండంచుఁ గొలువ నా సతి కడుపున్
బండించెను శ్రీగిరి సో
ముం డనువీక్షించి - మగఁడు మోదము నొందెన్!

మిత్రులందఱకు నమస్సులతో...

కొండొకఁడు సతీ యుతుఁడై
మెండుగ హరిఁ గొల్చియు, "ధన మి"మ్మన, దయ వి
ష్ణుం డిడె! సతిపైఁ గనక
మ్ముండను వీక్షించి, మగఁడు మోదము నందెన్!!

Monday, September 28, 2015

59 -- పద్య రచన - 1017 (వినాయక నిమజ్జనం)


కవిమిత్రులారా, పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 9/27/2015 12:01:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమః

సజ్జన జాతిని బ్రోచుచు
ముజ్జగముల నేలుచుండు మూషికరథుడౌ
యొజ్జ గనేశుని గొలచుచు
మజ్జన మొనరించుచుండ్రి మమకారముతోన్
సెప్టెంబర్ 27, 2015 5:09 [PM]


ఊకదంపుడు చెప్పారు...

నిత్య పూజ లన్ని నియమానుసారము
సలుప లేక జనులు సాగనంపు
పర్వ మద్దె పెద్ద పండువగా మారెఁ
గాంచుడిద్దియె కలికాల మహిమ.

Sunday, June 21, 2015

58 - పద్య రచన - 938 (కన్నతల్లి)


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 6/21/2015 12:01:00 [AM] 

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

వసంత కిశోర్ చెప్పారు...
పీక వరకు నీరు - వెల్లువగట్టినన్
పిచ్చి తల్లి బాలు - విడువలేదు
కన్నతల్లి సాటి - కన్నతల్లేగదా !
దైవమిలను తిరుగు - తల్లివోలె !

Thursday, May 14, 2015

57 - సమస్యా పూరణము - 1674 (కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 5/14/2015 12:02:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Chandramouli Suryanarayana చెప్పారు...
నాకమృతసమానమగును
భీకరమగు చేదుకూడ ప్రియతమ వినుమా
నీకరములతోనిచ్చిన
కాకర కాయల రసమ్ము కడుమధురమగున్
మే 14, 2015 12:25 [AM]

కంది శంకరయ్య చెప్పారు...
ఆ కవి వేమన చెప్పెను
గా కోరి తినఁ దిన వేము గడుఁ దియ్యన నౌఁ
గా కడు నభ్యాసమ్మున
కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్

Sunday, May 10, 2015

56 - పద్య రచన - 901 (కందా నీ బొందా)


కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వ్యంగ్య చిత్రకారిణి ‘శాంత’ గారికి ధన్యవాదాలతో)

నా పద్యము...
పనులలోన మున్గి వ్యస్తురాలైన యి
ల్లాలిని విసిగించ మేలు గాదు,
కంద పేరు ప్రాస కందగ నీబొంద
యనిన పతికి గాయ మాయె నహహ!

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 5/10/2015 12:01:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

వసంత కిశోర్ చెప్పారు...
కంద కూర నీదు - బొందకూరనినంత
వేగ మాడు పగిలె - విరిగె చేయి
ప్రాస కుదిరి నంత - పరిహాస మది తప్పు
భార్య తోడ నైన - భర్త కెపుడు !

Wednesday, April 15, 2015

55 - సమస్యా పూరణము - 1648 (రణము కవులకు కీర్తికరమ్ముగాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రణము కవులకు కీర్తికరమ్ముగాదె.
(ఆకాశవాణి వారి సమస్య)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 4/15/2015 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

డా. విష్ణు నందన్ చెప్పారు...
యతుల మన్నించి ప్రీతి నత్యాదరమునఁ
బ్రాసలౌదలఁ దాల్చి నిర్వ్యాజ భక్తిఁ
గావ్య కన్యకకుం గూర్చఁగల యలంక
రణము కవులకు కీర్తికరమ్ముగాదె !