Wednesday, April 15, 2015

55 - సమస్యా పూరణము - 1648 (రణము కవులకు కీర్తికరమ్ముగాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రణము కవులకు కీర్తికరమ్ముగాదె.
(ఆకాశవాణి వారి సమస్య)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 4/15/2015 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం  :

డా. విష్ణు నందన్ చెప్పారు...
యతుల మన్నించి ప్రీతి నత్యాదరమునఁ
బ్రాసలౌదలఁ దాల్చి నిర్వ్యాజ భక్తిఁ
గావ్య కన్యకకుం గూర్చఁగల యలంక
రణము కవులకు కీర్తికరమ్ముగాదె !

Thursday, March 26, 2015

54 - పద్య రచన - 859 (శంకరుడి ఆభరణం)




కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/25/2015 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యములు :

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
కంది వారి తోట కవనంపు విరులంట
పద్య విద్య యందు ప్రాజ్ఞు లంత
శంక రాభ రణము సాటివే రేదని
వేలు పనుచు గురువు వేడె భక్తి
మార్చి 25, 2015 3:12 [AM]

మిస్సన్న చెప్పారు...
కవనవైభవ మన్న కమనీయ హారాన
........తాపిన మణులు పద్యము లనంగ
సరసచమత్కృతుల్ సందడి జేసెడు
........పూరణ రత్నాలు పొదిగి రనగ
ధగధగ మెరయుచు తాకుచు హృదయాల
........దత్తపదీ వజ్ర తతులు నిగుడ
పద్యరచనములన్ ప్రభల నుద్దీపించు
........పచ్చలు భాసింప ముచ్చటగను

తనరు మహనీయ విష్ణునందనుల వంటి
కవికులాన్వయ చంద్రుల కైత లనెడు
పగడముల నుంచి శంకర భవ్య శిల్పి
చేసె శంకరాభరణమ్ము భాసురముగ.
మార్చి 25, 2015 6:40 [PM]

Wednesday, March 18, 2015

53 - న్యస్తాక్షరి - 21 (బమ్మెర పోతన)


న్యస్తాక్షరి - 21
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :

జిగురు సత్యనారాయణ చెప్పారు...
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్

Wednesday, March 11, 2015

52 - పద్యరచన - 845 (అద్దంతో మా ఆవిడ)



కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 3/11/2015 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
నారంభా నా యూర్వసి
చేరంగా రావెయంచు చెంతనె రోజున్
తీరుగ జెప్పి యబద్ధము
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.
మార్చి 11, 2015 7:53 [AM]

Sunday, March 1, 2015

51 - సమస్యాపూరణం – 1129 (మనము శాంతించు నెన్నొ సమస్య లున్న)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
"మనము శాంతించు నెన్నొ సమస్య లున్న".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 7/31/2013 06:00:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

Zilebi చెప్పారు...
సడలి బడలి ఇంటికి రావంగ
మురిపెంగ గృహిణి సేద తీరనీయంగ
మనంబున సంతోషమ్ము ఉరకలేయంగ,
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న!
జులై 31, 2013 6:38 [AM]

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
శ్రీమతి జిలేబీ గారిభావానికి నాపద్యరూపము......

పలుతెఱంగులనుద్యోగ బడలికలను
మరువజేయంగ నేర్చిన మహిత మూర్తి
పతిని సేవించునట్టి సద్భార్యవలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న.

నేటికార్యాలయమ్మునందాటుపోట్లు
ఘోర రహదారి పయనంబు గూర్చు నట్టి
బాధ మరిపించి మురిపించు భార్య వలన
మనము శాంతించు నెన్నో సమస్యలున్న
జులై 31, 2013 3:36 [PM]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
పసిడి ముద్దుల నగవుల మిసిమి తనయ
చేరి యొడి లోన కిలకిల చిలుక పలుకు
చుండ పులకించి సంతస మొందినంత
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న
జులై 31, 2013 10:10 [PM]

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
మనమునందున భయమును మసలనీక
నేది జరిగిన మనమంచికేననుచు
ఫలితమెంచక భగవంతు భక్తి గొల్వ
మనము, శాంతించు నెన్నొ సమస్య లున్న

Friday, February 27, 2015

50 - పద్యరచన - 832 (గళ్ళనుడికట్టు)


కవిమిత్రులారా,  పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/26/2015 12:13:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
భాషయందు పట్టు బాగుగా చూపెట్టు
కళయె పట్టుబడును కలము బట్టి
అడ్డనిలువు గనుచు నా గళ్ళనుడికట్టు
పట్టుబట్టి నింపు వారికెపుడు.
ఫిబ్రవరి 26, 2015 8:30 [PM]

లక్ష్మీదేవి చెప్పారు...
పదములపైన పట్టు గల వారును, భాషనుఁ బ్రేమతో సదా
ముదమగురీతులందు నొక మోహన వాగ్ఝరి గల్గువారునున్,
కదములు త్రొక్కగల్గు బలు కైతల గుఱ్ఱములెక్కువారు, నీ
పదచతురంగకేళినిక బల్వురు మెచ్చగ నింపుచుండరే!

Tuesday, February 24, 2015

49 - పద్యరచన - 821 (బొప్పాయి)

కవిమిత్రులారా,



పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 2/14/2015 12:05:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
subbarao చెప్పారు...
పండది జూడగా మిగుల పక్వము నొందుచు నెఱ్ఱ గా నునై
అండము లెన్నియో కలిగి హర్షము నీయుచు నందమై మఱిన్
మెండుగ నిచ్చుగా నిలను గుండెకు బాగుగ శక్తి పుంజమున్
బొండము వోలెయా ఫలము బొప్పయి నామము పేర నుండెగా

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
గొప్పగ నుండును రుచియే
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్
కప్పున కలిసిన ముక్కల
బొప్పాయిని తినగ మిగుల పొట్టకు హాయౌ.
ఫిబ్రవరి 14, 2015 8:44 [AM]

Tbs Sarma చెప్పారు...
ఎబిసిడి విటమిన్లు హెచ్చుగ నుండగ
తరచుగ తినుచుండ తనివి దీర
యాకలి పుట్టించు, నందము పెంచును
మోమున గుజ్జును మెత్తు చుండ,
పత్రముల్ పనిచేయు పదునుగ డెంగ్యూ జ్వ
రంబున జనులకు, రక్త వర్ణ
ము రుధిర మందున పొదలు కొనును,
రక్తపోటుకు పచ్చి యుక్త మగును,
జలుబు, చెవిపోటు, తామర, మొలల, కీళ్ళ
నొప్పు లందు ఫ్లూ జ్వరమున నొప్పు నోయి
కామ భావనోత్ప్రేరక కారకంబు
కనగ కల్పవృక్ష మనగ కనుల ముందు.
ఫిబ్రవరి 14, 2015 2:23 [AM]