Wednesday, June 11, 2014

011 - పద్యరచన - 586 (చిన్నారి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వడ్డాది ఉదయకుమార్ గారికి ధన్యవాదాలతో...

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

Pandita Nemani చెప్పారు...
జ్ఞాన దీప్తులు మోము కంజాతమును నిండె
....పలుకుల తల్లి యా పసిడి బొమ్మ
వివిధ శోభల తోడ విలసిల్లు చున్నది
....శ్రీమహాలక్ష్మి యా చిట్టితల్లి
సౌభాగ్యరేఖల చాల వెల్గుచునుండె
....శంభు నర్థాంగి యా సన్నుతాంగి
ముగ్గురమ్మలకును మూలపుటమ్మయౌ
....ఆదిపరాశక్తి యా మనోజ్ఞ
ఆమె సద్గుణగణముల కాటపట్టు
కట్టు బొట్టుల కామెచే కలిగె ఠీవి
సాటి వారలలో నామె స్వర్ణభూష
అచ్చముగ నామె ఆంధ్రుల యాడుబిడ్డ 
Chandramouli Suryanarayana చెప్పారు...
చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్
భారత సంప్రదాయములు బాగుగ వృద్ధిని పొందచూడ నా
కోరిక తీరునేమొనని కొంచెముగా చిగురించెనాశయున్
చంద్రమౌళి రామారావు గారి పూరణ:

భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి
న్నారికి, నారికే యిట మనన్ భయమౌ ప్రియ దైవమా! నమ
స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్
సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువై
మిస్సన్న చెప్పారు...
గురువుగారి కోరిక ననుసరించి ముఖపుస్తకము లోని నా పద్యము:

పోకముడిని బట్టి పొల్పు మీరగ జుట్టి
......కుచ్చెళ్ళు తగ బెట్టి కోక గట్టి

జాకెట్టు ధరియించి జారు పైటను దిద్ది
......మొలనూలు బిగియించి మురిపెమొదవ

పైటకొం గెగురంగ పదపడి గాలికి
......పై యంచు కనుపింప పట్టి చేత

వెనుక విలాసమై తనరార వాల్జడ
......నంచలు సిగ్గిల నడుగు లిడుచు

తెలుగు నట్టింట నడయాడు కలికి జూచి
నింగి వేలుపు లెల్లరు పొంగి పోయి
సిరుల జల్లుగ కురియరే చెలువు మీర
చీర కట్టుకు సరియేది చిన్నదాన!






No comments:

Post a Comment